• ‘వాస్తవం’ శ్రీనివాస్‌ దండుగుల

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాల గ్యారెంటీ కార్డును రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలతో ఆరేశారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూరు మండలం పడగల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను ప్రజలను మోసపుచ్చే హామీలుగా ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవకతవకలను గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పేపర్ల మీద మంజూరైన ఇండ్లన్నీ.. వాటి బిల్లులన్నీ పేదలకు సక్రమంగా చేరలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించామని లెక్కల్లో చెబుతున్న ఇండ్లన్నీ నిర్మాణం జరిగి ఉంటే ఇప్పుడు ఇండ్లు లేని పేదలు ఉండేవారే కాదన్నారు. కాంగ్రెస్‌ చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల లెక్కల్లో డొల్ల తనాన్ని ప్రజల ముందు ఉంచే విధంగా ప్రయత్నించారు. ‘పేరుకే ఇందిరమ్మ ఇండ్లు.. కాంగ్రెసోళ్ల జేబులోకే సగం బిల్లు’ అంటూ ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరిగిందని సెటైరికల్‌ గా వివరిస్తూ పోయారు.

కాంగ్రెస్ పాలనలో రైతులకు రూపాయికొత్త సాయం కూడా అందలేదని చెబుతూ.. పంట పెట్టుబడి కోసం కేసీఆర్ రైతులకు రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక చేయూతను గుర్తు చేస్తూ.. రైతుపై టిఆర్ఎస్ పార్టీకి ప్రేమ ఉన్నట్లా..? లేక కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నట్లా..? అనే ప్రశ్న ఉదయించేలా కాంగ్రెస్ రైతు గ్యారెంటీ హామీని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇస్తున్న నాలుగు వేల రూపాయల పింఛన్ హామీని ఎందుకు నమ్మాలో చెప్పండి అంటూ ప్రశ్నలు వేస్తూ కార్యక్రమంలో చర్చ రేకెత్తించేలా ఉదాహరణలు వివరించారు. ‘నాడు వారి పాలనలో 200కు మించి ఇయ్యక పాయే.. నేడు వారు పాలిస్తున్న కర్ణాటకలో 4000 ఇయ్యక పోవట్రీ.. మరి ఓట్లు దగ్గర పడంగనే తెలంగాణల 4000 ఇస్తాం అంటే ఎట్లా నమ్ముడు’ అని సభలో జనంతో ముచ్చట పెట్టిన చందంగా మంత్రి మాట్లాడటం.. సభలో కూర్చున్న వారు ఏకాగ్రతతో మంత్రి మాటల్ని వినడం స్పెషల్ గా నిలిచింది.

ఏ కొందరికో పింఛను ఇచ్చి ఎందరికో నిరాశ మిగిల్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు కేసీఆర్‌ హయాంలో ‌ ఎందరికో పింఛన్ ఇస్తుంటే అక్కడక్కడ మిగిలిన కొందరితో రోడ్డెక్కే రాజకీయం చేస్తుండడం న్యాయమేనా ..? అంటూ సభికుల నుంచి స్పందన కోరారు. 6 గ్యారంటీల కార్డును బాండ్ పేపర్ తో పోల్చి గుర్తు చేయడంతో చప్పట్ల మోత వినిపించింది. బిజెపి బాండ్ పేపర్ అబద్ధాలు మర్చిపోకముందే ఆరు అబద్దాల గ్యారెంటీ కార్డుతో కాంగ్రెస్ ఓట్ల కోసం వస్తున్నదని బిజెపి, కాంగ్రెస్ పార్టీలను పోల్చి ఆలోచించేలా పంచులు వేశారు. కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో డబ్బుల కంటే రెండింతలు మూడింతలు డబ్బులు అంటూ ఓట్ల కోసం అర్రాస్ పాటలాగా హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల లాంటి వాడు కెసిఆర్ కాదని చెబుతూ.. చేసేదే, హామీ ఇచ్చాక నిలబెట్టుకోగలిగేదే కేసీఆర్ చెబుతాడని పేర్కొంటూ .. కెసిఆర్ కూడా పించను డబ్బులను 2 వేల నుంచి ఇంకా ఎక్కువ డబ్బులకు పెంచేటట్లే ఉన్నాడని చెబుతూ రాష్ట్రంలో 2000 రూపాయల పింఛను సీఎం కేసీఆర్ పెంచబోతున్నట్లు నర్మగర్భంగా సందేశం ఇచ్చారు.

You missed