(వాస్తవం- శ్రీనివాస్)
జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పై కత్తి దూసింది. రానున్న ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్సేనని ప్రగాఢంగా నమ్ముతున్న బీఆరెస్ ఇప్పుడు ఏ మీటింగులోనైనా దాన్నే టార్గెట్ చేస్తోంది. బీజేపీని లైట్ తీసుకుంటోంది. కానీ ఈ జగిత్యాల వేదికగా కవిత కాంగ్రెస్ జాతీయ స్థాయి నుంచి మొదలుకొని లోకల్ సీనియర్ లీడర్ , ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని కూడా వదలకుండా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఘాటు విమర్శలు చేశారు. ఆ పార్టీ ఔట్ డేటేడ్ అంటూనే.. నఖల్ మార్‌నే కో బీ అఖల్ రహనా.. అని కాంగ్రెస్‌కు తమను చూసి కూడా నఖల్ కొట్లే బుద్ది, తెలివి లేదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ,ఎమ్మెల్సీ రమణ, మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కవిత ప్రసంగం ఆసాంతం కాంగ్రెస్‌పై కత్తి దూసి ఎడాపెడా గాట్లు పెట్టేసింది. నాలుగు వేల పింఛన్ ప్రస్తావన తెచ్చిన ఆమె.. ఏ రాష్ర్టంలో ఎంతెంత పింఛన్లు ఇస్తున్నారో గణాంకాలతో సహా చెప్పి మరీ పరువు తీసినంత పని చేసింది. రాహుల్ గాంధీకి … కేసీఆర్ స్పీడ్‌ను అందుకునే తెలివి లేదన్నాదామె. అందుకే టీఆరెస్ బీఆరెస్‌గా అవతరించిందని, కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో బీఆరెస్ ప్రత్యామ్నాయం కానుందన్నారు. ఇక్కడికొచ్చి నాలుగు వేల పింఛన్ ఇస్తామంటే ఎవరు మిమ్మల్ని నమ్మేదని ఎద్దేవా చేశారామె. ‘జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చి పోడు పట్టాలు పంపిణీ చేస్తామంటున్నారు… వారికేమైనా తెలివుందా..? కొంచెం అప్ డేట్ కాండ్రా బాబు.. మీరింకా ఔట్ డేటెడ్‌గానే ఉన్నారు… మీమెప్పుడో పోటు పట్టాలు పంపిణీ చేశాం..’ అని వ్యంగ్యంగా చురకలంటించారు. రాహుల్‌కు ఏమీ తెలియదని, ఇక్కడి నేతలు ఏదో చెబితే అది పలికి పోతున్నారని, ప్రాక్టికల్‌గా చెప్పినవి చేసే సత్తా ఆ పార్టీకి లేదన్నారామె. ఇక ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై ఆమె తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
తనకు ఇదే చివరి ఎన్నిక అంటూ సెంటిమెంట్ ప్లే చేస్తూ ప్రజల వద్ద సానుభూతి పొంది గెలవాలని చూస్తున్న..జీవన్‌రెడ్డి ఈసారి కూడా ఇదే ట్రిక్కు ప్లే చేస్తాడని, ఆ పప్పులేమీ ఉడకవన్నారు డాక్టర్ సంజయ్‌ను గతంలో 60 వేల మెజారిటీతో గెలిపించారు.. ఇప్పుడు ఈ మెజారిటీనీ మరింత పెంచి మనమే చరిత్రను బ్రేక్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారామె. దేశంలోనే నెంబర్ వన్ పాలన సీఎం కేసీఆర్ అందిస్తున్నారని, అస్సాంలో కూడా మన పథకాలే కాపీ కొట్టేందుకు రెడీ అయ్యారని అన్నారు. అన్ని రంగాల్లో కేసీఆర్ పరి పాలన దక్షత వల్ల నెంబర్‌లో రాష్ట్రం నిలిచిందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులంతా హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడే మోపవుతున్నారని, వారితో ఏమీ కాదన్నారు. ఆఖరికి కాంగ్రెస్ నాయకులను ఆమె రాక్షసులతో కూడా పోల్చి చెప్పారు. అప్పుడు రావణాసురుని రాక్షణ సేన అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉందని ఆమె వ్యంగ్యంగా మాట్లాడటం చర్చకు తెరతీసింది.