మాస్ లీడర్ గోవన్న ఆవేదన చెందాడు. గుస్సా అయ్యాడు. లీడర్ల వ్యవహార శైలి మండిపడ్డాడు. ఇలా అయితే కుదరదని క్లాస్ పీకాడు. పద్దతి మార్చుకోండని చురకలంటించాడు. ఇంతకీ ఏమైంది..? గోవన్న ఆవేదన వెనుక ఆంతర్యమేమిటీ..? లీడర్లకు చురకలంటించి, హితబోధ చేయడం వెనుక మతలబేంటీ..? ఇటీవల ‘వాస్తవం’లో ‘ ప్రగతి పథం.. ప్రచారం మితం..’ అనే శీర్షికన ఓ కథనం వచ్చింది. దీనిపై ఆయన తనదైన శైలిలో మోపాల్ మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించారు.
‘మాస్’ క్లాస్ పీకారు. ‘ పొద్దున నేను లేవకముందే నా ఇంటి వద్ద బారులు తీరుతారు. ఐదారు గంటలు నన్ను కదలినీయరు.. నాకు చక్కరొచ్చేదాకా వదలరు.. ఇలా రోజూ నా టైమంతా తినేస్తే నేను పల్లెలలకు పోయేదెప్పుడు, జనాలతో కలిసేదెప్పుడు..??’ అని ఆగ్రహమయ్యారు. ‘ ఎన్నో అభివృద్ధి పనులు ప్రారంభాలకు సిద్దంగా ఉన్నాయి. వాటిని ప్రారంభించుకునే టైం కూడా ఇస్తలేరు. ఎంతో అభివృద్ధి చేశాను రూరల్‌లో. సీఎం కేసీఆర్, కవిత, మంత్రి సహకారంతో ఎన్నో నిధులను తెచ్చుకున్నాను. తండాలకు గ్రామ పంచాయాతీ భవనాలు కట్టించినం.. సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణలక్ష్మీ చెక్కులు ఇలా ఎన్నో కోట్ల నిధులు వెచ్చిస్తున్నాం.. కానీ అవి చెప్పుకునే టైం ఏదీ.. ప్రజలతో కలిసి అభివృద్ధి పురోగతిని వివరించుకునే వీలేది..? అంతా మీ వల్లే..’ అంటూ ఫైరయ్యాడు. ఏదో వారంలో రెండు సార్లు రండి చాలు.. రోజుకు మూడు పూటలు నా చుట్టూ ప్రదక్షిణలు చేయకండని లీడర్లకు క్లాసు పీకాడు గోవన్న..