నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ బాగా పెరిగింది. దీన్ని బీసీలకు కేటాయించారు. దీంతో డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ అర్బన్‌ నుంచి పోటీకి సిద్దమై.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో మాట కూడా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అర్బన్‌లో మున్నూరుకాపులు ఎక్కువగా ఉండటం, తన తండ్రి రాజకీయ నేపథ్యాన్ని బలంగా చూపుతూ తనకు రాజకీయంగా అర్బన్‌ కొత్త లైఫ్‌ ఇస్తుందని భావించాడు సంజయ్‌.

కానీ అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తున్నాడు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, లోకల్‌ లీడర్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌. తనకే అర్బన్‌ టికెట్‌ కేటాయించాలని, ఎట్టి పరిస్థితుల్లో సంజయ్‌ కి ఇవ్వొద్దని పోరాడుతున్నాడు. రేవంత్‌ సంజయ్‌ వైపు ఉన్నాడు. ముందే కమిట్‌మెంట్‌ ఇచ్చి ఉన్నాడనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. అదేమీ వినడం లేదు మహేశ్‌. నేనూ బీసీనే.. నాకూ ఓట్లు పడతాయి.. నాకివ్వాలి అంటూ మొండి పట్ట పట్టాడు. ఇక్కడి నుంచి మొత్తం డజను మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ తనకు ఇచ్చే ఇష్టం రేవంత్‌కు లేకపోతే… వేరొవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని, సంజయ్‌కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని ఢిల్లీ పెద్దల దగ్గర వరకు తీసుకెళ్లాడు.

దీంతో ఈ గల్లీ పంచాయతీ కాస్తా ఢిల్లీకి వెళ్లింది. సంజయ్‌కు మున్నూరుకాపుల ఓట్లు ప్లస్‌ కాగా.. మైనార్టీలో కూడా కొంత ప్రభావం చూపుతాడనే నమ్మకం రేవంత్‌కు ఉంది. సర్వే రిపోర్టులో కూడా ఇదే తేలింది. దీంతో గట్టిగా రేవంత్‌ సంజయ్‌ వైపు వాదిస్తున్నాడు. దీన్ని తీవ్రంగా మహేశ్‌కుమార్‌ వ్యతిరేకిస్తున్నాడు. గత చరిత్ర తవ్వుతున్నాడు. డీఎస్‌ శకం ముగిసిందని, అతన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు గౌడ్‌. అర్బన్‌ టికెట్‌ పంచాయతీ అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. తనకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉన్నా.. ఎందుకు మహేశ్ వ్యతిరేకిస్తున్నాడో అతని విజ్ఞతకే వదిలేస్తున్నానని, తనకు టికెట్ ఇవ్వకున్నా.. తనకు పార్టీలో గౌరవం, మర్యాద, పదవి ఇచ్చే విషయంలో అధిష్టానం క్లారిటీ ఉందని సంజయ్‌ తన సన్నిహితుల వద్ద ధీమాగా ఉన్నాడని తెలుస్తోంది.

You missed