ఈగ సంజీవరెడ్డి నుడా చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం కంఠేశ్వర్‌లో ఉన్న నుడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, అర్బన్, రూరల్ కార్యకర్తలు,ఈగ సంజీవరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. పార్టీ ఆవిర్భావంన నుంచే అధినేత కేసీఆర్ తో కలిసి నడిచిన ఉద్యమ చరిత్ర ఈగ సంజీవరెడ్డిది. ఏనాడూ తను పదవులు ఆశించలేదు. పార్టీ పటిష్టతకు, లక్ష్యం కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పార్టీలో క్రియాశీలకంగా లేకుండా వ్యవసాయానికే పరిమితమవుతూ అడపాదపడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. రూరల్ నియోజకవర్గం నుంచి గోవన్న గెలుపులో ఈగ సంజీవరెడ్డికి కీలక పాత్ర. వీరిద్దరూ మంచి మిత్రులు కూడా. ఎప్పటి నుంచో ఈగ సంజీవరెడ్డికి ఓ పదవి ఇప్పించాలని చాలా ప్రయత్నం చేశాడు బాజిరెడ్డి. కానీ కుదరలేదు. చివరగా తనే జోక్యం చేసుకుని జిల్లా ఒలంపిక్ సంఘం అద్యక్షుడిగా ఈగ సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చక్రం తిప్పాడు బాజిరెడ్డి. ఆ తర్వాత నుడా కోసం అధిష్టానాన్ని ఒప్పించి తన చిరకాల మిత్రుడికి నుడా కానుకగా అందించాడు గోవన్న. మితభాషిగా, మృదు స్వభావిగా, అందిరివాడిగా మంచి పేరు గడించాడు ఈగ.