నిజామాబాద్ జిల్లాలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయ పతాకాన్ని ఎగురవేయడమే లక్ష్యంగా ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జంగ్ సైరన్ మోగించారు. నిజామాబాద్ జిల్లాలో విజయాలను ఖరారు చేసే దిశగా ఇటీవలే కవిత పూర్తి బాధ్యతను స్వీకరించి ఎన్నికల పోరు సన్నాహాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా నియోజక వర్గాల వారీగా లోతైన సమీక్షలు మొదలుపెట్టారు. లోటుపాట్లను గుర్తించి పార్టీ శ్రేణులకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కధన సైనికులుగా పనిచేసేలా కర్తవ్య బాధ్యతలు నిర్ణయించారు. బూత్ లెవెల్ నుంచే విజయమే లక్ష్యంగా ముందుకు సాగేలా శ్రేణులను క్రియాశీలం చేశారు. కవిత ఆరంభించిన ఈ కృషి బుధవారం బోధన్ నియోజకవర్గంలో ఆమె నిర్వహించిన పాదయాత్ర లో సఫలమై కనిపించింది. ఆమె పూరించిన విజయ శంఖారావం ఆరంభంలోనే ఈ పాదయాత్ర కు ప్రజల నుంచి వచ్చిన స్పందన విజయ యాత్రను తలపించింది అనడం అతిశయోక్తి కాదు.
జిల్లా కోడలిగా తన మెట్టింటి నుంచే ఈ సమర యాత్ర ప్రారంభించి జిల్లా టిఆర్ఎస్ విజయాలు తన బాధ్యత అని చాటారు. బోధన్ నియోజకవర్గంలో సాధించబోయే మెజారిటీ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఉండాలని కవిత పిలుపునివ్వడం ఘనమైన విజయాలనే ఆవిష్కరించాలని ఆమె సంకల్పాన్ని ప్రతిబింబించింది. జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుపునకు కల్వకుంట్ల కవిత విజయ దిక్సూచిగా నిలువనున్నారని బుధవారం బోధన్ నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్ర స్పష్టంగా చాటి చెప్పింది.