ఎమ్మెల్సీ కవిత డిచ్‌పల్లి వాసులకు అనుకోని అతిథి అయ్యారు. నిజామాబాద్‌లో అప్పటి వరకు బిజీబిజీగా గడిపిన ఆమె.. సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి ఆకస్మిక పర్యటన చేశారు. డిచ్‌పల్లిలో ఆగి అక్కడ స్థానికులతో మమేకమయ్యే సరికి అంతా అవాక్కయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆమె డిచ్‌పల్లిలోనే పర్యటించారు. పిల్లలను, పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ .. సరదాగా సెల్ఫీలు దిగారు. అనుకోని అతిథి వారి కనులముందే కనిపించే సరికి ఉబ్బితబ్బిబ్బయిన మహిళలు, పిల్లుల, పెద్దలు ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీలు పడ్డారు.
డిచ్‌పల్లిలో రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఆమె డిచ్‌పల్లి గ్రామం నుంచి బస్టాండ్ వైపునకు వచ్చేందుకు మధ్యలో రైలు పట్టాలు ఉన్న కారణంగా.. రైలు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో గేటు పదే పదే పడటం ఇబ్బందికరంగా మారిందనే విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యేతో కలసి పరిశీలించారు. పట్టాలపై నడిచారు. రైల్వే స్టేషన్లో కలియతిరిగారు. రైల్వే ఓవర్ బ్రిడ్డి నిర్మిస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఇవాళ తన పుట్టిన రోజు అని ఓ కుర్రాడు వచ్చి ఎమ్మెల్సీ కవిత ఆశీర్వాదం తీసుకున్నాడు. చిన్న గిఫ్ట్‌తో అతనికి బర్త్ డే విషెస్ తెలిపారు కవిత. అక్కడి నుంచి ఆమె ఓ హోటల్‌లో నాయకులు, కార్యకర్తలతో కలిసి చాయ్ తాగారు. తీరిగ్గా వారితో ఆమె మాటమంతీ చూసి అక్కడి జనాలు ఆశ్చర్యంగా, ఆనందంగా గమనించారు.
చివరగా ఖిల్లా రామాలయాన్ని సందర్శించుకున్నారు. గుడిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆరా తీశారు. కవిత వెంట బాజిరెడ్డి గోవర్దన్‌తో పాటు బాజిరెడ్డి జగన్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారు మోహన్, స్థానిక లీడర్లు ఉన్నారు. ఖిల్లా రామాలయం వద్ద పిల్లలు గణేశ్ చందాలను కవిత దగ్గర తీసుకున్నారు. ఆమె సంతోషంగా ప్రతీ గణపతి మండలికి చందా రాసి పిల్లలతో సరదాగా గడిపారు.