వారంతా సీనియర్లు. క్యాబినేట్ ర్యాంక్ నేతలు. వీరిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరికి వారే సాటి. వీరంటే కేసీఆర్ ఇష్టం. అపారమైన నమ్మకం. ఉమ్మడి జిల్లాలో పార్టీ వైభవంలో ఎవరి పాత్ర వారిదే. ఈ నలుగురు అసెంబ్లీ సెషన్స్ ముగిసిన నేపథ్యంలో ఒకచోట కలిశారు. ముచ్చటించుకున్నారు. రాజకీయాలు మట్లాడుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. సీనియర్ నేత, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ ముద్దుగా లక్ష్మీ పుత్రుడు అని పిలుస్తారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో ఆయన తనదైన ముద్రవేసుకుని అందరి మన్ననలు పొందారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి శాసన సభ వ్యవహారాల శాఖ ఉండటంతో ఆయన ఎలాంటి సమయంలోనైనా సమావేశాలను సమన్వయ పర్చుకోవడంలో ప్రతిపక్ష సభ్యులను కట్టడి చేసి క్రమశిక్షణగా సభ నిర్వహించడంతో ఆరితేరారు. అందరి చేత మన్ననలు పొందారు. అందరిని కలుపుకుపోతారనే గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ది మరో ప్రత్యేకత. మాస్ లీడర్‌గా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగానికి ఓ స్పెషాలిటీ ఉంటుంది. సబ్టెక్టుకు తోడుగా ఆయన తన సహజ శైలిని కూడా జోడించి మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సెషన్స్‌లో ప్రధానంగా ఆర్టీసీ ఇష్యూయే కొనసాగింది. ఎన్నో ఆటంకాల మధ్య ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ఆమోదించే గొప్ప అవకాశాన్ని ఆయన తీసుకుని తన రాజకీయ జీవితంలో మరుపురాని రోజుగా గుర్తుంచుకున్నారు. మరొకరు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్. బీసీ లీడర్‌గా కష్టపడి ఎదిగిన నాయకుడు. ఆత్మాభిమానం నిండుగా ఉన్న లీడర్. నమ్ముకున్నవారికి నేనున్నానంటూ అభయహస్తమందించే నాయకుడు. ఈ హేమాహేమీలంతా ఇలా కలుసుకుని సరదా ఫోటో తీసుకుని మురిసిపోయారు.