బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ టార్గెట్గా ముత్యాల సునీల్ రెడ్డి సంధించిన స్వాగత సభ వ్యూహం బెడిసి కొట్టిందా… టిక్కెట్టు ఎవరికైనా రావచ్చు, ఎవరికి వచ్చిన అందరూ పనిచేయాలి.. అది ఈరవత్రి అనిల్ కావచ్చు, మానాల మోహన్ రెడ్డి కావచ్చు, అన్వేష్ రెడ్డి కావచ్చు, సునీల్ రెడ్డి కావచ్చు.. అంటూ గురువారం ముత్యాల సునీల్ రెడ్డికి నిర్వహించిన స్వాగత సభలో వేదిక మీద ఉన్న నేతలే మాట్లాడిన మాటలు సునీల్ రెడ్డి టిక్కెట్టు టార్గెట్ వ్యూహాన్ని తిప్పి కొట్టాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు స్పష్టం చేస్తున్నాయి.
ముత్యాల సునీల్ రెడ్డి ఢిల్లీలో మల్లికార్జున ఖరిగే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక వెంటనే బాల్కొండ నియోజకవర్గానికి రాలేదు. నియోజకవర్గాన్ని అతి భారీ వర్షాలు వెంటాడి అతలాకుతలం చేసిన సందర్భంలో సైతం సునీల్ రెడ్డి నియోజకవర్గ వైపు రాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నియోజకవర్గంలో ప్రజల వద్దకు రాలేదు అనే విమర్శలు ఎదురైనా నియోజకవర్గ వైపు అడుగుపెట్టలేదు.
కాంగ్రెస్లో చేరాక భారీ ర్యాలీతో నియోజక వర్గానికి వచ్చి స్వాగతం సభతో బలం చాటుకుని టిక్కెట్టు తనకే అనేలా వాతావరణాన్ని సృష్టించుకునే వ్యూహాన్ని అమలు చేయించాడనే ప్రచారం కాంగ్రెస్ పెనుల్లో వినిపించింది. కానీ గురువారం సునీల్ రెడ్డికి నిర్వహించిన స్వాగత సభ వేదిక సునీల్ రెడ్డి వ్యూహాన్ని టిక్కెట్ రేసులో ఉన్న మిగతా నేతలకు తిప్పికొట్టే వేదికయింది. టికెట్టు ఇంకా ఫలానా వారికే అనేదేమీ జరగలేదని వేదిక పైన పలువురు నేతలు చెబుతూ సునీల్ రెడ్డికి టికెట్టు హామీ ఏమి లభించలేదని పరోక్షంగా కార్యకర్తలకు స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.
మాజీ విప్, అనిల్ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కిసాన్ ఖే త్ నాయకుడు అన్వేష్ రెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ వారు కూడా టికెట్ రేసులో ఉన్నారని వారికి ఎవరికి వచ్చినా గెలిపించుకోవాలని మాట్లాడుతూ సునీల్ రెడ్డి మాత్రమే ఫైనల్ కాదు అనే సంకేతాలు వదిలారు. ఈ ఉపన్యాసాలు సునీల్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా బాల్కొండ కాంగ్రెస్ లో గ్రూపులు బలంగా ఉన్నాయని విషయాన్ని బయటపెట్టాయి.