కాంగ్రెస్‌ బీసీ జపం చేస్తోంది. ఇందూరు పాలిటిక్స్‌లో కచ్చితంగా సామాజికన్యాయం పాటించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో అగ్రవర్ణాలదే పై చేయి. పైకెన్ని మాటలు చెప్పినా.. చివరగా ఎన్నికలు వచ్చే సరికి పోటీలో ఉండి ఆర్థికంగా బలంగా ఉండి టికెట్లు దక్కించుకునేది అగ్రవర్ణాలకు చెందిన నాయకులే. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతుందనే భావన అంతటా ఉంది. దాదాపు అన్ని పార్టీల్లో ఇదే తీరు. కాంగ్రెస్‌ ఈ మధ్యే పుంజుకోవడంతో ఈ పార్టీ నుంచి టికెట్ల కోసం కూడా అగ్రవర్ణాలు పోటీలు పడుతున్నాయి. గతంలో బీజేపీ నుంచి పోటీ పడ్డ నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు.

అయితే కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో రెండు బీసీలకు ఇవ్వాని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు ఉన్న నియోజకవర్గాల్లో దాదాపు ఐదింటిలో అగ్రవర్ణాలే కబ్జా చేసి ఉన్నారు. దీంతో వీటిల్లో బీసీలకు అవకాశం లేకుండా పోయింది. ఇక మిగిలింది నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాలు. ఈ రెండు నియోజకవర్గాల్లో సరైన నాయకుడు లేడు మొదటి నుంచి. ఎన్నికల సమయంలో ఎవరికో ఒకరికి అప్పగించి చేతులు దులుపుకోవడం తప్ప.. ఈ రెండింటిలో ఇన్చార్జిగా ఉండి పార్టీ జెండా మోసిన నాయకుడు లేడు. అనుచరులను, కార్యకర్తలను కాపాడుకున్న నాయకుడు లేడు. ఇప్పుడు బీసీలు ఈ రెండు నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. అర్బన్‌ లేదా ఆర్మూర్‌ అనే రీతిలో బీసీ క్యాండిడేట్లు స్వపక్షం నుంచే కాదు.. అధికార పార్టీ నుంచి కూడా టికెట్‌ ఇస్తే మేమొస్తామంటే మేమొస్తామనే రీతిలో ఎగబడుతున్నారు. లాబీయింగ్‌ చేస్తున్నారు. ఫైరవీలకు దిగుతున్నారు.

అర్బన్‌ బరి నుంచి ధర్మపురి సంజయ్‌ తనకే టికెట్‌ దక్కుతుందని ఒంటరిపోరు చేస్తున్నాడు. కానీ ఇక్కడ నుంచి సంజయ్‌కు టికెట్‌ రావడం సీనియర్‌ నేతలెవ్వరికీ ఇష్టం లేదు. దీంతో ఆర్మూర్‌కు పంపాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాల్కొండ నుంచి సునీల్‌ కాంగ్రెస్‌లో చేరడంతో అక్కడ అనిల్‌కు అవకాశం దక్కదనేది తేలిపోయింది. బీసీ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన అనిల్‌కు ఆర్మూర్ ఇస్తే లెక్క సరిపోతుందని కూడా అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కూడా ఇక్కడ ఓ కర్చీఫ్‌ వేసి పెట్టుకున్నాడు.

తాజాగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ గ్రామానికి చెందిన గోర్తె రాజేందర్‌ రేపోమాపో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయాడు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డితో సంప్రదింపులు జరిపాడు. ఆర్మూర్‌లో ఇప్పటి వరకు జెండా మోసే ఏ నాయకుడు దిక్కులేని నేపథ్యంలో తాను అక్కడ పనిచేసి క్యాడర్‌ను నెలకొల్పి పార్టీని బలోపేతం చేసుకుంటానని, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా వేడుకుంటున్నాడు. ఒకవేళ బీసీలో మరెవ్వరికీ ఇచ్చినా తాను వారి గెలుపు కోసం పనిచేస్తానని కూడా చెబుతున్నాడు. దీంతో అర్బన్‌, ఆర్మూర్‌ ఈ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్‌ బీసీలకే కేటాయించనుందని తేలిపోయింది. బోధన్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి బరిలో ఉండనుండగా… బాల్కొండ సునీల్‌ లేదా మోహన్‌రెడ్డిలు రెడీగా ఉన్నారు. కోరుట్లలో వెలమకు, జగిత్యాల జీవన్‌రెడ్డికి ఇవ్వనున్నారు. దీంతో నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు అగ్రవర్ణాలకే దక్కనున్నాయి. రెండు మాత్రం బీసీలకే కచ్చితంగా ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో అర్బన్‌, ఆర్మూర్‌లను వీరికి కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

You missed