ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నిజామాబాద్ జిల్లా అధికార యంత్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారితో కల్వకుంట్ల కవిత వర్షాలపై శనివారం ఫోన్లో సమీక్షించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, ఆయా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు, సహాయక చర్యలు వంటి అంశాలపై పలు సూచనలు ఇచ్చారు.

లోతట్టు ప్రాంతాలను, వరద బాధిత ప్రాంతాలను సందర్శించి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని, కనీస అవసరాలకు లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. వైద్యం, ఆహారం, విద్యుత్, రోడ్డు సౌకర్యాల పునరుద్ధరణ కోసం ఎక్కడికక్కడ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏదైనా సహాయం కోసం అధికారులను వెంటనే సంప్రదించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించగలరని కోరారు. కంట్రోల్ రూమ్ తోపాటు తన కార్యాలయం కూడా నిరంతరం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

సహాయక చర్యలకు సంబంధించి అధికారులు
తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలను సీఎం కేసీఆర్ కు తెలియజేస్తానని, అత్యవసరంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కవిత తెలిపారు.

You missed