ఎస్సారెస్పీలో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం నుంచి వచ్చి చేరుతున్న జలదృశ్యాలను వీక్షించేందుకు రైతులు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు తీరంలోని ముప్కాల్‌ పంప్‌హౌజ్‌ వద్దకు తరలి వస్తున్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్‌, చౌట్‌పల్లి గ్రామాల రైతులు బస్సుల్లో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా వచ్చిన జలాలను చూడటానికి సందర్శనకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఊరూరా రైతులు తరలివెళ్లి సందర్శించిన చందంగా ఎస్సారెస్పీలో కాళేశ్వరం జలాలు సంగమిస్తున్న దృశ్యాలను చూసేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 300 కి.మీ దూరంలోని లోతట్టు ప్రాంతం నుంచి 600 మీటర్ల ఎగువకు ఎదురెక్కి ప్రవహిస్తూ కాళేశ్వరం జలాలు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి చేరడం ప్రారంభమయిన రోజు నుంచే రైతుల్లో సందర్శించి రావాలన్న ఆసక్తి నెలకొన్నది.

కమ్మర్‌పల్లి మండల రైతులు సందర్శనకు వెళ్లిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో తాము సైతం ఎస్సారెస్పీకి సందర్శనకు వెళ్లనున్నామని, పలు గ్రామాల నుంచి అదే సోషల్‌ మీడియాలో సందేశాలు పోస్ట్‌ అవుతున్నాయి. దీంతో రైతులు శ్రీరాం సాగర్‌లో కాళేశ్వరం జలాల సందర్శన యాత్రలు పెరగనున్నాయని స్పష్టమవుతోంది. సందర్శనకు వెళ్లిన కమ్మర్‌పల్లి మండల రైతులకు ఎస్సారెస్పీ తీరంలోని ముప్కాల్‌ పంప్‌హజ్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి భోజనాలు ఏర్పాటు చేయించారు.

ఇక మీదట సందర్శనకు వచ్చే రైతులకు సైతం మంత్రే భోజన సౌకర్యం కల్పించనున్నారు. కమ్మర్‌పల్లి మండలం నుంచి వచ్చిన రైతులు కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీలోకి చేరే దృశ్యాలను చూసి పులకించి పోయారు. రైతులకు శాశ్వతంగా సాగునీటి సమస్యలేని ఎస్సారెస్పీని సీఎం కేసీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వానలు లేకున్నా.. కాళేశ్వరం జలాలతో సాగు సంబురంగా సాగుతుందని ఆనందంగా ముచ్చటించుకున్నారు. ఈ పరిస్థితుల్లో బాల్కొండ నియోజకవర్గంలో రైతులు మండలాల వారీగా ఎస్సారెస్పీ కాళేశ్వర జలాల సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారు నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ఆగస్టు 5వ తేదీ వరకు ఉంది.

You missed