అర్వింద్‌ అనుకున్నది సాధించాడు… బండిని సాగనంపాడు…

అర్వింద్‌కు ఇక జిల్లాలో తిరుగులేదు…

బండి వర్గం పేరుతో అసమ్మతి నడిపిన నేతలకు ఇక చెక్…

పార్టీలో అర్వింద్‌ మరింత దూకుడు…

అర్వింద్‌ పట్టించుకోని సీనియర్లు, అసమ్మతి నేతలు.. ఇక పార్టీ మారాల్సిందే…

టికెట్ల పంపిణీలో అర్వింద్‌దే కీలక పాత్ర… అధిష్టానం పుల్‌ సపోర్టు.. అర్వింద్‌ నిర్ణయంలో జోక్యం ఉండదు…

 

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ తనకు అడ్డు లేకుండా చేసుకున్నాడు. అసమ్మతి నేతలు మొన్నటి వరకు తనకు బూచిగా చూపి అధిష్టానం వద్ద ఫిర్యాదులు చెబుతూ కాలం గడుపుతూ సమాంతర బీజేపీగా వ్యవహరించిన తీరు అర్వింద్‌కు మింగుడుపడలేదు. జిల్లాపై అంతా తన ఆధిపత్యమేనని విర్రవీగిన తనకు అసమ్మతి గళం పంటికింద రాయిలా మారింది. దీనికి ఆజ్యం పోసి.. అసమ్మతిని పెంచి పోషించి దరి చేర్చుకున్నది రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయేనని అర్వింద్‌కు తెలుసు. అందుకే బాహాటంగానే అర్వింద్‌ చాలా సార్లు బండి గురించి వ్యతిరేకంగా మాట్లాడారు.

తను పార్టీ అధ్యక్షుడిగా కాదు.. తన వ్యక్తిగతంగా మాట్లాడాడంటూ కొన్ని వ్యాఖ్యలను మీడియా వేదికగా తిప్పికొట్టడం కూడా వీరిద్దరి మధ్య ఎంతటి అగాథం ఏర్పడిందో తెలియజేసింది. ఇక అప్పట్నుంచి జిల్లాలో తమకు టికెట్లు ఇవ్వకుండా, పార్టీలో గుర్తింపు ఇవ్వకుండా ఉన్న నేతలంతా బండి పంచన చేరారు. ఎప్పటికప్పుడు బండి ద్వారా అధిష్టానానికి అర్వింద్‌ ఒంటెత్తు పోకడలపై ఫిర్యాదులు చేస్తూ .. పార్టీ పూర్తిగా దెబ్బతింటున్నదని, ఇదే వైఖరి అలవంభిస్తే ఎవరూ ఉండరనే వార్నింగ్‌ కూడా ఇస్తూ వచ్చారు. దీంతో అర్వింద్‌ మరింత భగ్గుమన్నాడు. తన సహజ శైలికి మరింత ఆజ్యం పోశాడు. ఇంకా ఎక్కువ చేశాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, వ్యవహరించిన వారిని దూరం పెట్టేశాడు.

ఏ మీటింగులకు పిలవలేదు. అసలు మేం పార్టీలోన ఉన్నామా..? అనే రీతిలో అసమ్మతి నేతలకు అనుమానం వచ్చేలా.. అవహేళన చేసేలా అర్వింద్‌ ప్రవర్తించాడు. అయినా బండి మీద నమ్మకంతో అలాగే పార్టీలో ఉంటూ అర్వింద్‌పై పోరాటం చేస్తూ వచ్చారు. కానీ ఈ ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డు వేశాడు అర్వింద్‌ అండ్‌ టీమ్‌. బండి సంజయ్‌ను సాగనంపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించారు. వెంటనే అర్వింద్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి కిషన్‌రెడ్డిని ఆకాశానికెత్తేశాడు. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు… బండి పీడ విరగడైందని ఎంత సంతోషంగా తను ప్రెస్‌మీట్‌పెట్టాడో.

ఇక జిల్లాలో తనకు తిరుగులేదు. తను చెప్పిందే వేదం కావాలి. తనుకు నచ్చినవారికే టికెట్లు రావాలి. తను మాట విన్నవాళ్లే పార్టీలో ఉండాలి. లేదంటే ఇతర పార్టీల్లో చేరుకోవచ్చు అనే సంకేతాలిచ్చేశాడు. యెండల లక్ష్మీనారాయణ వర్గానికైతే ఇది మరింత మింగుడు పడని విషయమనే చెప్పాలి. తన వ్యతిరేక వర్గాన్ని పూర్తిగా అణగదొక్కేందుకు అర్వింద్‌ ఏ మాత్రం వెనుకాడడు. రానున్నది ఎన్నికల సీజన్‌. తనకు నచ్చిన అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకుని అన్నో ఇన్నో సీట్లు గెలిపించుకుంటే అధిష్టానం వద్ద మరింత పలుకుబడి పెరుగుతుందని భారీ ఆశలే పెట్టుకున్నాడు అర్వింద్‌.

అయితే అర్వింద్‌ అసమ్మతి నేతలు ఇప్పుడప్పుడే పార్టీ వదిలేలా లేరు. ఎందుకంటే కొత్త అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పట్టించుకోకున్నా…. బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారనే ఊహాగానాలున్నాయి. కానీ అవి ఇప్పటంతలో కనిపించడం లేదు. ఓ రకంగా సీనియర్లంతా కలిసి బండి రాజకీయ జీవితాన్ని రైలుబండి పట్టాల మీద పడుకోబెట్టినంత పనిచేశారు. దీంతో జిల్లాలో ఆయన్ను నమ్ముకున్న నేతలకు చుక్కెదురు.. చేదు అనుభవాలే ఎదురుకానున్నాయి. అర్వింద్‌ ఇప్పుడు జిల్లాలో మోనార్క్‌. ఎవరి మాట వినడు. మూర్ఖుడు రాజుకున్నా బలవంతుడు కదా.. ఇప్పుడు అర్వింద్‌ కూడా రాజు కన్నా బలవంతుడే. పార్టీ సిద్దాంతాలు, రాద్దాంతాలు అవసరం లేదు. తనకు నచ్చింది చేస్తాడు. అనుకున్నది చేసి చూపిస్తాడు. అదే జరగబోతుంది.

You missed