టీయూ వీసీగా ఐఏఎస్‌ కావాలెను…

మళ్లీ ప్రొఫెసర్లే ఇంచార్జిలుగా వస్తే… ఇదే గతి.. అంతే సంగతులు..!!

ఆందోళన పడుతున్న విద్యార్ధులు.. ఈసీ మెంబర్లు..

ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటేనే వర్సిటీ బాగుపడుతుంది…

 

తెలంగాణ వర్సిటినీ పట్టి పీడించి రక్తం పీల్చిన వీసీ జలగ కటకటాలు లెక్కిస్తోంది. పీడ విరగడైంది. సంబురాలు చేసుకున్నారంతా. కానీ వ్యవస్థను మొత్తం కుప్పకూల్చి అవినీతిమయం చేసి ఆగమాగం బతుకు చేసిన వీసీ చేష్టలను, జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే మళ్లీ ఏదో ఒక ప్రొఫెసర్‌కు ఇన్చార్జి బాధ్యతలిస్తే … ఇగో ఇలాగే మన రవీందర్‌ గుప్తా లాగా నాది స్వయం ప్రతిపత్తి అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించి మళ్లీ కథ మొదటికే తెస్తాడనే అభిప్రాయం ఉంది. సోమవారం నాటికి కొత్త వీసీని తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త వీసీగా ఓ ఐఏఎస్‌ అధికారి అయితేనే బెటర్‌ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలో ఐఏఎస్‌లు వీసీలుగా చేసి అంతో ఇంతో వర్సిటీ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.

నీతూప్రసాద్‌, పార్థసారథి తదితరులు, శైలజా రామయ్యార్‌ తదితరులు వీసీగా చేసి ఆ పదవికి వన్నె తెచ్చారు. అంతిమంగా ఈ ఐఏఎస్‌ ఆఫీసర్లు వీసీలుగా ఉంటే ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తారు. రూల్స్‌ ఫాలో అవుతారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండదు. ఎవరైనా బలవంతపెట్టినా రిలీవ్‌ అయినా అవుతారు.. కానీ ఇష్టానుసారం వర్సిటీని అవినీతి ప్రతిష్ట పాలు చెయ్యరు. గతంలో ఇది రూఢీ అయ్యింది. రవీందర్‌ గుప్తా ఇంత రచ్చ చేసి ప్రభుత్వాన్నే పరేషాన్‌ చేసి పరువును బజారుకీడ్చిన ఉదంతం ఉండనే ఉంది కాబట్టి.. ఎవరో ఒక ప్రొఫెసర్‌ను వేస్తే సరిపోతుంది.. ఇన్చార్జిగా అంటే.. దీన్ని బాగు చేయడం.. పూర్వవైభవం తేవడం కల్ల. ఇంతా చేసి మళ్లీ కథ మొదటికే తెస్తారా..? ఐఏఎస్‌ను నియమించి వర్సిటీని గాడిన పెడతారా…? ఇప్పుడు ఈ చర్చ విద్యార్థి, ఈసీ మెంబర్లలో కీలకంగా జరుగుతోంది.

You missed