ఇందూరుకు రేవంత్‌రెడ్డి టీమ్ రెడీ..
ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఒక క్లారిటీకి వచ్చేసిన పీసీసీ చీఫ్..
అర్బన్ ధర్మపురి సంజయ్, రూరల్ అరికెల, బోధన్ సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్ వినయ్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి….
నిజామాబాద్- వాస్తవం ప్రతినిధి:
ఇందూరు రాజకీయాలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నజర్ పెట్టారు. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తే గెలవగలరో ఓ అంచనాకొచ్చారు. ఉన్నవారిలో గెలుపుగుర్రాలను ఎంచుకునే పనిని దాదాపుగా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత ..మొన్నటి వరకు బీజేపీ వైపు ఆసక్తి చూసిన ఎమ్మెల్యే ఆశవాహ అభ్యర్థులు ఇప్పుడు కాంగ్రెస్‌ను అంత తక్కువగా చూడటం లేదు. మరీ తీసిపారేయడం లేదు. వెతకబోయిన తీగ కాలికితగిలినట్టు ఇటు కాంగ్రెస్‌కు అభ్యర్థుల కొరత లేకుండా పోయింది… అటు ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకునే వారికి కాంగ్రెస్ ఓ ఆశాదీపంలా కనిపిస్తున్నది. ఇప్పడు అసలు విషయానికొద్దాం… ఇందూరులోని ఐదు నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయాలనేదిపై పీసీసీ చీఫ్ ఓ క్లారిటీకొచ్చేశాడని తెలుస్తోంది. బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మళ్లీ బరిలోకి దింపాలనుకుంటున్నారు.
ఆయన మొదటల్లో ససేమిరా అన్నాడు. రెండు సార్లు ఓడిపోయిన తర్వాత ..ఏజ్ మీద పడిన తర్వాత మళ్లీ పోటీ తనకు ఇష్టం లేదని పార్టీ పెద్దలతో చెప్పినా వారు వినలేదు. ఒకవేళ చివరి నిమిషంలో టీఆరెస్ షకీల్ కాంగ్రెస్‌వైపు చూస్తే తప్ప సుదర్శన్‌రెడ్డినే కొనసాగించే వీలుంది. ఇక అర్బన్‌లో డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ పోటీ చేస్తారని ప్రచారం ఉంది. దీన్ని ఆ పార్టీ పెద్దలే జీర్ణించుకోవడం లేదు. కానీ సంజయ్ చాపకింద నీరులా తన పార్టీ కార్యక్రమాలు, చేరికలు చేసుకుంటూ పోతున్నాడు. రేవంత్ తనకు మాటిచ్చాడని, పోటీ చేయడమే మిగిలి ఉందని, ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా పట్టించుకోబోననే మొండి పంతంతో ముందుకు పోతున్నాడు.
ఇక నిజామామాద్ రూరల్‌లో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిని బరిలోకి దింపాలనుకుంటున్నాడు రేవంత్. రేవంత్‌కు అరికెలకు మంచి సంబంధాలున్నాయి. అరికెలకు బీఆరెస్‌లో తగిన ప్రాధన్యత లేదని రగిలిపోతున్నాడు. అసంతృప్తితో ఉన్నాడు. దీంతో పాటు ఈసారి ఎలాగైనా రూరల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాడు. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడే బదులు… మంచి సంబంధాలు, మర్యాద, గౌరవం ఉన్న కాంగ్రెస్ వైపు వెళ్లడమే బెటరనే అభిప్రాయంతో అరికెల ఉన్నట్టు తెలుస్తోంది. బాల్కొండ నుంచి సునీల్ బీజేపీ తరపున టికెట్ ఆశించినా.. అర్వింద్ అడ్డుపడుతున్నాడు. అక్కడ మల్లిఖార్జున్ రెడ్డికే టికెట్ ఇప్పిస్తానని వాగ్దానం చేసి ఉండటంతో .. సునీల్ ఢిల్లీ పెద్దల వద్ద మొర పెట్టుకున్నా పెద్దగా ఫలితం లేకుండా పోయిందనే చెప్పాలి. దీంతో రేవంత్ సునీల్‌తో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఆర్మూర్ బీజేపీ టికెట్ కూడా ఈసారి వినయ్ రెడ్డికి ఇచ్చే పరిస్థితి లేదు. దీని కోసం పోటీ పెద్దగా ఉంది. అర్వింద్‌కు, వినయ్‌కు మధ్య సంబంధాలు చెడాయి.
ఇక బీజేపీ టికెట్‌పై వినయ్ ఆశలు కూడా పెట్టుకోలేదు. సునీల్, వినయ్ ఇద్దరూ రేవంత్‌తో ఇప్పటికే టికెట్ విషయంలో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన అనధికారికంగా కాంగ్రెస్ తన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ముందే ప్రకటించుకుని ఉంది. చవరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగితే తప్ప.. వీరే రేపు కాంగ్రెస్ బరి నుంచి పోటీలో ఉంటారనే ప్రచారం ఊపందుకున్నది.