ది ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ సంబారి మోహన్ అధ్యక్షతన సోమవారం ఐడీసీఎంఎస్ ప్రధాన కార్యాలయంలో 53 వ మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించాలని, అన్ని సహకార సంఘాల అధ్యక్షులకు ప్రొటోకాల్ వర్తింపజేయాలని తీర్మానాలు చేశారు. ఏప్రిల్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు అయిన వ్యాపారము, 2023-24 సంవత్సరంలో ఆదాయ, వ్యయ అంచనా బడ్జెట్, 2020-21 ఆడిట్ రిపోర్టును సభ్యులకు వివరించగా, సభ్యులంతా ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఈ సమావేశానికి ఐడీసీఎంఎస్ ఉపాధ్యాక్షులు ఏదుళ్ల ఇంద్రసేనా రెడ్డి, ఎన్‌డీసీసీబీ డైరెక్టర్లు, ఐడీసీఎంఎస్ డైరెక్టర్లు, నిజామాబాద్ జిల్లా సహకార అధికారి సింహాచలం, పీఏసీఎస్ చైర్మన్లు, బిజినెస్ మేనేజర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.