సంక్షేమ ఫలాలు అందించే విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌లో ఉందని, అందులో రాష్ట్ర సంక్షేమ ఫలాలు అధికంగా మహిళలకే అందుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుంచుతున్నదని, కేసీఆర్ మహిళా లోకానికి పెద్ద పీట వేస్తున్నారని ఆమె అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఆమె ఆరే గూడెం, సంస్థాన్ నారాయణపూర్, మునుగోడు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి సంస్థాన్ నారాయణపూర్‌లో జరిగిన గౌడ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె హాజరయ్యారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మహిళల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, చర్యల గురించి ఆమె ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆకుల లలితకు ఘన స్వాగతం లభించింది. అక్కడి ఆడబిడ్డలు ఆమెతో నవ్వుతూ మాట్లాడారు. కాసేపు మహిళలతో ఆకుల లలిత సరదాగా ముచ్చటించారు. పింఛన్లు ఎలా అందుతున్నాయి..? అందరికీ పింఛన్లు వస్తున్నాయా.. ? అని అడిగి తెలుసుకున్నారు.
ఓటు ఎలా వేయాలో వృద్దులకు అవగాహన పరిచారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళా లోకం మరింత అభివృద్ది చెందుతుందని ఆమె వివరించారు. ఆమె వెంట ఆరే గూడెం సర్పంచులు, ఎంపీపీలు, టీఆరెస్ పార్టీ ప్రెసిడెంట్లు, మహిళా నాయకురాళ్లు, కోదాడ కౌన్సిలర్, ఎల్బీ నగర్ మహిళా ఉపాధ్యాక్షురాలు, షాద్ నగర్ మార్క్‌ఫెడ్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.