పూరీ జగన్నాథ్… ఓ విలక్షణమైన డైరెక్టర్. ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న దర్శకుడు. అప్పటి వరకు ఉన్న సినీ ట్రెండ్‌ను చెరిపేసి తనదైన మార్క్‌ను వేసుకున్నవాడు. చాలా మంది కొత్త వాళ్లకు లైఫ్ ఇచ్చినవాడు. కథాబలమే హీరో అని నమ్మినవాడు. పొగరు, అహంకారం, ఆత్మవిశ్వాసం నిండుగా హీరోపాత్రకు నింపి తనదైన డైలాగులు చెప్పించినవాడు. అందుకు ఇంతకాలం కొనసాగుతున్నాడు. ఇంకా తనదైన దర్శకత్వ ప్రతిభ పదును తగ్గలేదని సమయం వచ్చినప్పుడల్లా నిరూపించినవాడు. తన వ్యక్తిగత జీవితం ఎలాగైన ఉండొచ్చు. ఇక్కడ అప్రస్తుతం.
తను అనుకున్న పాలసీ ప్రకారం నిర్భయంగా ముందుకు సాగడంలో ఆదర్శంగానే నిలిచాడు. తాజాగా విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ సినిమాపై అంచనాలు ఆకాశానికంటాయి. హీరోలకే కటౌట్లను చూశాం ఇంతకాలం. కానీ ఇలా ఓ డైరెక్టర్‌కు కటౌట్ పెట్టడం చాలా అరుదు. ఆ అరుదైన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు పూరీ. ఎంతో మంది డైరెక్టర్లు వచ్చారు. పోయారు. కనుమరుగైపోయారు. కానీ కొందరే చాలా కాలం అలా ఉండిపోతారు అభిమానుల్లో. ఈ తరం ప్రేక్షకులకు హీరోలతో పాటు పూరీ కూడా ఓ అభిమాన దర్శకుడు.