రాంగోపాల్ వర్మ ఓ సినీ ఫంక్షన్‌లో తన గురించి తాను చెప్పుకుంటూ …… ఒకడు తనకు సోషల్ మీడియాలో కామెంట్ చేశాడట… ఏమని..? ఒరేయ్ నువ్వు ఎంత చంపినా చావని పామువురా..! అని.
మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వైఖరి, వ్యవహారం కూడా అలాగే ఉంది. నవ్విపోదురు గాక నాకేటీ సిగ్గు అన్న చందంగా ఆది నుంచి ఆయన అబద్దాలనే ఆలంబనగా చేసుకుని రాజకీయం చేస్తున్నాడు. బహుశా ఆయనకు ఆదర్శం…. ఆ పసుపుబోర్డు బాండ్ పేపరే అయ్యి ఉంటుంది. అంతకన్నా అబద్దం .. మోసం మరేముంటుంది..? ఇక అప్పట్నుంచి రైతులను నమ్మించి మోసం చేసినట్టే… అందరినీ అదే దారిలో నరుక్కుంటూ వస్తున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అబద్దం చెప్పడం మోసం కాదు… కానీ ఆ అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అని. కానీ మన అర్వింద్ ఎప్పుడో అబద్దాల స్థాయి నుంచి మోసం చేసే ప్రమోషన్ వరకు వెళ్లాడు. ఆ లిస్టు చాంతాడంతా ఉంది గానీ.. తాజాగా నిన్న మొన్న జరిగిన సంఘటనే ఇప్పుడు చర్చకు దారి తీసింది. వైరల్ అవుతున్నది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
అదేంటంటరా..?
వేల్పూర్ ఎక్స్ రోడ్డులో రైతు ధర్నా చేశారు బీజేపీ వాళ్లు. అర్వింద్, రఘునందన్‌రావు ముఖ్య అతిథిలు. మల్లిఖార్జున్‌ను జనానికి చూపి పది మందికి పరిచయం చేసుందుకు పెట్టుకున్న మీటింగులా ఉందది. ఎందుకంటే ఆ మీటింగుకు రైతులే లేరు. అంతా బీజేపీ నాయకులు, కార్యకర్తలే. పోనీ రైతుల గురించి ఏమన్నామాట్లాడిండ్రా అంటే… అంతా పరనిందలు, వ్యక్తిగత దూషణలు… మతిలేని ఆరోపణలు… పసలేని ప్రసంగాలు.
ఇందులో ఒకటి…. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన చెక్ డ్యాం గురించి మాట్లాడుతూ… అందులో కొన్నింటి పేర్లు చెప్పి వీటికి కేంద్రమే నిధులు సమకూర్చిందని ఓ పచ్చి అబద్దం ఆడేశాడు. దీనిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ప్రతీ పైసా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని ఆధారాలు చూపెట్టారు. అసలు ఆ అబద్దాల అర్వింద్‌క్ కౌంటర్ ఇచ్చుడు కూడా దండగే అని చెప్పాలి. ఎందుకంటే ప్రజలేనాడో అర్వింద్ మాటలు పట్టించుకోవడం మానేశారు. ఇక అర్వింద్ మంత్రి కౌంటర్‌కు ఓ వీడియో రిలీజ్ చేశాడు. మీ అధికారులే ఆ లెక్కలిచ్చారు… ఆ ఆఫీసర్లనేం చేస్తారు…? అని మరో అబద్దం ఆడాడు. అసలు నిజమే లేనప్పుడు…. అది వాస్తవమే కానప్పుడు అధికారులెందుకు తప్పుడు లెక్కలు చెప్తారు…? లాజిక్ లేదు.. కానీ అర్వింద్ తన అబద్దాన్ని నిజం చేసేందుకు అధికారులపై నెపం నెట్టాడు. దీనికి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ మధుసూదన్ ఘాటుగా తిప్పికొట్టాడు. ఆధారాలు బయటపెట్టాడు. అధికారుల వద్ద ఉన్న లెక్కలు ఇవీ అని తేల్చి చెప్పాడు. రాష్ట్రమే ప్రతీ పైసా భరించిందని మాడుపగలేటట్టు జవాబుతో ఈడ్చి కొట్టాడు. ఇదీ సంగతి…!!
చివరగా…. అర్వింద్ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని దునుమాడుతూ తాజాగా విడుదల చేసిన వీడియోలో… హుందా రాజకీయాల గురించి మాట్లాడాడు. ఎంతో మంది జిల్లాకు చెందిన మంత్రులను చూశానని, ఇలాంటి మంత్రిని చూడలేదని, వాళ్లంతా హుందాగా ఉన్నారని ఏదేదో అన్నాడు. చిల్లర, అబద్దపు, మోసం రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అర్వింద్ ఈ మాటలనడం… దెయ్యాలు వేదాలు వల్లించినట్టు లేవు… నవ్వుకుంటున్నారా..? అయినా మీరు నవ్వితే ఆయన కేంటీ సిగ్గు… నవ్వుకోండి..!!