కారు లోడెక్కువైంది. ఎంపీగా కవిత పోటీ చేసే సమయంలో ఎంతో మంది కారెక్కారు. వారందరికీ ఆశలు కల్పించారు. ఆశల పల్లకిలో వీరంతా ఊరేగారు. కానీ ఆమె గెలవలేదు. వీరి ఆశలు తీరలేదు. ఓపిక పట్టారు. కాళ్లకు చెప్పలరిగేలా తిరిగారు. కాలం గడుస్తున్నా పదవులు మాత్రం ఇప్పట్లో రావనే సంకేతాలు ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయి. లోడెక్కువైన కారులో నుంచి జారుకోవడమే మేలని ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. బీజేపీకి ఇప్పుడు వీరికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. టీఆరెస్‌పై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీలోకి వెళ్తే గెలుపు ఖాయమని, పదవులు తథ్యమనే భావన మొన్నటి వరకు కారులో, ఆశల పల్లకిలో ఊరేగిన నేతలకు అవగతమైంది.
అర్బన్‌లో ఓ వైపు బీజేపీ కార్పొరేటర్లు టీఆరెస్ వైపు చూస్తుండగా… నిజామాబాద్ టీఆరెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. సీనియర్ నాయకుడు, రైస్ మిల్లర్ల సంఘం కీలక నేత వీ మోహన్‌రెడ్డి టీఆరెస్‌కు గుడ్ బై చెప్పాడు. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించాడు. బోధన్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించాడు. కవిత .. మోహన్‌రెడ్డికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని చేస్తానన్నారు. చివరి వరకు ఆశలు పెట్టుకున్న మోహన్‌రెడ్డి ఆశ అడియాసే అయ్యింది. అయినా ఇంకేదైనా హామీ దొరుకుతుందేమోనని చూశాడు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. కొన్ని రోజులుగా ఈ విషయం టీఆరెస్ పెద్దలకు తెలిసినా.. ఎవరూ స్పందించలేదు. దీంతో మోహన్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. కారుతో ఢీ అంటే ఢీ అని తేల్చుకునేందుకు సిద్దమయ్యాడు. షకీల్‌పై పోటీకి సై అంటున్నాడు.