గ్యాస్ బండ ధ‌ర పెరిగింది. వెయ్యి ఎప్పుడో దాటింది. ప‌ద‌కొండొంద‌ల‌కు చేరువ‌య్యింది. ఇవాళ ఇదే హాట్ టాపిక్‌. ష‌రా మామూలుగానే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ. సాలు మోడీ.. సంప‌కు మోడీ. దేవుడ‌య్యా.. మోడీ.. అంటూ సెటైర్లు. కొంద‌రు బీజేపీ అభిమానులు దీనికి కౌంట‌ర్లు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. మ‌న్మోహ‌న్ ఉన్న‌ప్పుడు కూడా వెయ్యి దాటింది తెలుసా..? అని గుర్తు చేసుకుంటున్నారు. ఇక కొంద‌రైతే మీరేం త‌క్కువా ..? అని టీఆరెస్ కూడా రేట్లు ఎడాపెడా పెంచిన వైనాన్ని ముందుంచుతున్నారు.

క‌రెంటు చార్జీలు, సినిమా టికెట్లు, మూడు సార్లు బ‌స్ చార్జీలు, రిజిస్ట్రేష‌న్ చార్జీలు, మద్యం ధ‌ర‌లు పెంచుతూ పోయారుగా సార్ అంటూ బ‌దులిస్తున్నారు. వాస్త‌వానికి రేట్ల పెంపుద‌ల విష‌యంలో ఎవ‌రేం త‌గ్గ‌డం లేదు. ఆదాయం ప‌డిపోయిన పేదోడికి ఇటు టీఆరెస్‌, అటు బీజేపీ న‌డ్డి విరుస్తుంది. జీవ‌న ప్ర‌మాణాలు పెర‌గ‌లేదు స‌రిగ‌దా పాతాళంలోకి ప‌డిపోయాయి. ధ‌ర‌లు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. రాజ‌కీయాల కోసం ఈ రెండు పార్టీలు ఒక‌ర్నొక‌రు తిట్టుకుంటూ క‌రుచుకుంటున్నా….. సామాన్యుడికి భార‌మే అవుతున్నారు త‌ప్ప వారి గోడు వీరికి ప‌ట్ట‌దు. ఎవ‌డి గోల వాడిది.