క్రీడల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబర్చిన ముగ్గురు నిజామాబాద్ బిడ్డలు
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్,అంతర్జాతీయ షూటర్ ఈషా సింగ్, అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య లకు నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన శుభాకంక్షలు
జిల్లాకే గర్వకారణం ఈ ముగ్గురు ఆడ బిడ్డలు
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్:
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్ కు చేరుకున్న నిఖత్ జరీన్, ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మూడు గోల్డ్ మెడల్ పతకాలు సాధించిన ఈషా సింగ్ , ఇండియన్ ఫూట్ బాల్ క్రీడాకారిణి సౌమ్య గూగులోత్ లకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
క్రీడల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబర్చిన ముగ్గురు నిజామాబాద్ బిడ్డలు తెలంగాణకు గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ప్రోత్సాహం, తల్లిదండ్రుల త్యాగం వీరి విజయం వెనుక ఉన్నాయని అన్నారు.ఎంతో అకుంఠిత దీక్షతో కష్టపడితే తప్పా ప్రపంచ స్థాయిలో రాణించలేరన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అన్ని రకాల ప్రోత్సాహం ఇస్తుందన్నారు.ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్,అంతర్జాతీయ షూటర్ ఈషా సింగ్, అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య(బోధన్) లకు నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన శుభాకంక్షలు తెలిపారు.జిల్లాకే గర్వకారణం ఈ ముగ్గురు ఆడ బిడ్డలన్నారు.
నిఖత్ జరీన్ కు త్వరలో జిల్లాలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి తాను వ్యక్తిగతంగా ప్రకటించిన లక్ష రూపాయల ప్రోత్సాహకం అందజేస్తానని తెలిపారు.
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటుతూ నిజామాబాద్ జిల్లా ప్రతిష్టను ఇనుమడింపచేసిన ప్రపంచ బాక్సింగ్ విజేత నిఖత్ జరీన్ మహిళ లోకానికి ఆదర్శమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. అనేక ప్రతికూలతలను ఎదుర్కొని ఎంతో ఆత్మస్థైర్యంతో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించడం సాధారణ విషయం కాదన్నారు. అందులోనూ మహిళలు అంతంతమాత్రంగానే ప్రాతినిధ్యం వహించే బాక్సింగ్ క్రీడను ఎంచుకొని ఎంతో ఆత్మ విశ్వాసంతో అకుంఠిత దీక్ష పట్టుదలతో అంచెలంచెలుగా ఎదుగుతూ, ప్రపంచ విజేతగా నిలవడం యావత్ తెలంగాణాకు గర్వకారణమని అన్నారు. నిఖత్ జరీన్ కు ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సాహం అందిస్తామని, కామన్వెల్త్ క్రీడల్లోను ఆమె విజయ బావుటా ఎగురవేయాలని ఆకాంక్షిస్తున్న ట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నిఖత్ జరీన్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేలా శిక్షణ అందించిన కోచ్ లకు, బాక్సింగ్ క్రీడలో ఆమెను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబీకులకు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, టూరిజం MD మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, క్రీడా శాఖ ఉన్నతాధికారులు సుజాత, ధనలక్ష్మి, డా హరికృష్ణ,వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.