అంద‌ర‌మ్మాయిల‌కు భిన్నంగా.. ఓ విభిన్నమైన క్రీడలో రాటు తేలింది నిజామాబాద్ నగరానికి చెందిన పదహారేళ్ళ నిఖత్ జరీన్. బంధుమిత్రులు విమర్శించినా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బాక్సింగ్ బరిలోకి దిగింది. శారీరక శ్రమతో పాటు క్షణాల్లో స్పందించే నైపుణ్యంతో సాధన చేసింది. అతి తక్కువ సమయంలోనే అనుకున్న లక్ష్యానికి చేరువైంది. 2011 లో టర్కీలో జరిగిన ప్రపంచ మహిళా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుని క్రీడా ప్రపంచంలో తళుక్కుమంది. 50 కిలోల విభాగంలో తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. ఇటీవ‌లే బల్గేరియా ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించి మరోసారి మెరిసింది. పేద కుటుంబంలో పుట్టి.. నలుగురమ్మాయిల్లో ఒకరిగా పెరిగిన నిఖిత్ ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉంది.. మరెంతో సాధనుంది..

ఆ నాన్న ప్రోత్సాహం… వెయ్యేనుగుల బ‌లం..
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ కాలనీకి చెందిన ఎండీ జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానాలకు నలుగురు కూతుళ్ళు. నిఖిత్ జరీన్ మూడో సంతానం. జమీల్ బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాలోని స్పోర్ట్స్ దుకాణంలో సేల్స్ మెన్ గా పదేళ్ళ పాటు పని చేశారు. ఫుట్ బాల్ క్రీడాకారుడైన జమీల్ తిరిగి వచ్చాక తన మూడో కూతురు నిఖిత్ జరీన్ ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ అనేక కష్ట నష్టాలతో కూతురి కోసం తపనపడ్డారు. బాక్సింగ్ కోచ్ శంషొద్దిన్ సూచనతో నిఖిత్ ను బరిలోకి దింపారు. ప్రతీ రోజు నాలుగు గంటల కఠోర శిక్షణ పొందారు. ఇక్కడ అమ్మాయిలెవరూ బాక్సింగ్ కు ఆసక్తి చూపక పోవడంతో నిఖిత్ జరీన్ అబ్బాయిలతోనే సాధన సాగించింది.

నిర్మ‌ల హృద‌య్‌లో విద్యాబ్యాసం…
నిజామాబాద్ లోని నిర్మల హృదయ బాలికోన్నత పాఠశాలలో చదివిన నిఖిత్ శిక్షణ ప్రారంభించిన మూడు నెలల్లోనే రాష్ట్ర స్థాయి పైకా క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించింది. రెండేళ్ళలోనే ప్రపంచ విజేతగా నిలిచింది. ఇంత తక్కువ కాలంలో ఏ క్రీడాంశంలోనూ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి రావడం అరుదు. అలాంటిది పురుషులకే చెమటలు కక్కించే బాక్సింగ్ లో అడుగుడిని అమ్మాయి, అతిస్వల్ప కాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అందరి ప్రశంసలు పొందుతోంది. నిఖిత్ జరీన్ తన కెరియర్ లో సాధించిన విజయాలివి..

– 2009 లో కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పైకా టోర్నీలో బంగారు పతకం.
– విశాఖ పట్టణంలో 2010 జనవరిలో జరిగిన అండర్ -16 కేటగిరీలో 48 కిలోల విభాగంలో బంగారు పతకం. అదే ఏడాది డిసెంబర్ లో విశాఖలోనే జరిగిన పోటీల్లో మరో పతకం.
– పంజాబ్ లోని అనంతపూర్ సాహెబ్ లో 2010లో జరిగిన జాతీయ స్థాయి పైకా టోర్నీలో కాంస్య పతకం.
– తమిళనాడులోని ఏరోడ్ లో 2010 లో జరిగిన జాతీయ స్థాయి అండర్ -16 టోర్నీలో బంగారు పతకం.
ఈ టోర్నీలోనే బెస్ట్ బాక్సర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆమె చూపిన ప్రతిభను గుర్తించిన సెలక్షన్ కమిటీ భారత జట్టులో చోటు కల్పించింది.
– పంజాబ్ లో 2011 లోజాతీయ స్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్ గెలుపొందింది.
– 2011లో టర్కీలో జరిగిన యూత్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించి తొలిసారిగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది.
– తాజాగా బల్గేరియా ప్రపంచ చాంపియన్ షిప్ లో రజతంతో మెరిసింది. ఇందులో ఆమె ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ విక్టోరియా విర్ట్ (ఉక్రెయిన్) ను చిత్తు చేసింది.

You missed