పుస్తక పఠనం మరిచిపోయింది నేటి తరం. పదో తరగతి కూడా రాక ముందే చేతిలో ఓ స్మార్ట్ ఫోన్. కర్ లో దున్యా ముట్టీ మే….. అన్నట్టు ప్రపంచం చేతిలో కుగ్రామమైన వేళ.. మంచికన్నా చెడువైపే ఇవి దారి తీస్తున్నాయి. పుస్తకాలు చదవడం ఏనాడో మానేశారు. ఓ చందమామ, ఓ బొమ్మరిల్లు, ఓ బాలమిత్ర… కథల పుస్తకాలు నేటి తరానికి తెలియవు. నవలలు ఎలా ఉంటాయో అసలే తెలియవు. రచయితల పేర్లు కూడా ఎప్పుడూ విని ఎరుగరు. కనీసం దినపత్రికలైనా చదువుతారా అంటే అదీ లేదు. పదో తరగతి చదివే పిల్లగాడికి అక్షరదోషాలు లేకుండా తెలుగు సరిగ్గా రాయలేని దుస్థితి ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో వేసవి సెలవులు వచ్చాయి. ఇంకేం పనుంటుంది. అదే పని. చేతిలో ఫోన్. ఇక వేరే ధ్యాస లేదు. అదే ప్రపంచం. ఫేస్‌బుక్, వాట్సాప్… సోషల్ మీడియాలో చక్కర్లు. గంటలు గంటలు వృథా. ఇదో వ్యసనం.
ఇప్పుడు ఉద్యోగాల సీజన్. మరి చదవులెలా సాగాలి. పాఠనాసక్తి ఎలా పెరగాలి. నిరుద్యోగులకు ఎలా ఉపయోగం జరగాలి…?? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి కొమ్రం భీం జిల్లా అడిషనల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డికి. ప్రతీ గ్రామంలో ఓ చెట్టు కింద ఓ పెట్టె పెట్టి అందులో అందరికీ అవసరమయ్యే పుస్తకాలను ఉంచేలా చర్యలు తీసుకున్నాడు. ఓ స్వచ్చంధ సంస్థ సహకారంతో ప్రతీ గ్రామంలో ఇలాంటివి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని స్టార్ట్ చేశారు. అంతటా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొద్ది సేపైనా సెల్‌ఫోన్లను పక్కకు పెట్టి ఇలా చల్లగా చెట్టు కింద సేద తీరుతూనే చేతిలో పుస్తకాలను పట్టుకుని అక్షరాల వెంట పరుగులు తీస్తున్నది ఇక్కడ యువత. వరుణ్ రెడ్డి ఆలోచన సూపర్. మరిచిన పుస్తకాలను చేతిలో పెట్టినందుకు. పాఠనాసక్తి పెంచేందుకు తనదైన ప్రయత్నం చేసినందుకు….