తండ్రీ, కొడుకులు కలిసి తీసిన తొలి సినిమా కథ ఆచార్య… అయ్యో అని పెదవి విరిచేలా చేసింది. అసలు మొదటి రోజు చిరంజీవి సినిమాకు సీట్లు ఖాళీ ఉన్నాయంటే… ఇది కూడా తొలిసారేమో. ముందే కథ తెలిసిపోయిందో.. అంతా సీన్ లేదని డిసైడయ్యారో…. ఈ సినిమా రిలీజ్ గురించి పెద్దగా పట్టించుకోక వదిలేశారో తెలియదు కానీ మొదటి రోజు.. మొదటి ఆట బుకింగ్‌లు ఖుల్లా.. సీట్లు ఖాళీ… ఆఖరికి పెదవి విరుపు. ఇదేం సినిమారా నాయన. అంటూ ఎర్రటి ఎండలు పడి వచ్చినందుకు తమను తాము తిట్టుకుంటూ బయటకు వెళ్లిపోతున్న జనం. ఇదీ క్షుప్తంగా ఈ సినిమా రివ్యూ.. ఫలితం.
ఆచార్య పేరు ఘనంగా పెట్టి చిరంజీవిని కొత్త ఆవిష్కరించేందుకు కొత్త కథను వినిపించి కొత్తగా తెరకెక్కించబోయి చతికిలబడ్డాడు కొరటాల శివ. ఆయనే కథ రాశాడంట. తన సినిమాలకు తనే కథలు రాసుకుంటాడు. దాదాపు అన్నీ అతుకుల బొంత కథలే శివవి. ఇదీ అట్లనే ఉంది. నక్సలైట్ నేపథ్యాన్ని చిరంజీవికి పెట్టి కొత్త కథను చెప్పుకుందామనుకున్నాడు. కానీ ఇదీ పాత చింతకాయ కథ. కిచిడీ కథ. అన్ని రసాలను అవవీలలగా పోషించే చిరు ఈ చట్రంలో ఇరుక్కుపోయి.. ఏమీ చేయలేక.. ఏదో చేద్దామన్నా… కథ కాళ్లకు అడ్డం పడి.. తను కింద పడి దుమ్ముకొట్టుకుపోయాడు. ముఖం మీద వేసిన మేకప్ వయసును దాచలేదు. నడకలో ఆ స్పీడ్ లేదు. డ్యాన్సులో ఆ ఈజ్ లేదు. మొత్తంగా ఈ ఆచార్య అప్పటి చిరు కానే కాదు. కథ కూడా ఆయనకు ఏ మాత్రం సరిపోనిది.
సిద్దపాదం అనే గిరిజన తండా చుట్టూ తిప్పి తిప్పి పాత్రలన్నీదాని చుట్టే గింగిరాలు కొట్టించి.. కథంతా ఈ చిన్న తండాతో ముడి పెట్టి.. గుడులు, గోపురాలు, మైనింగ్ అంటూ పాత కథలే కిచిడీ కింద మార్చేసి… దీనికి మళ్లీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఒకటి తగిలించి… లెక్కకు మించి విలన్లను తీసుకుని.. వారిని ఎడా పెడా చంపేసి…. ఆఖరికి ఆచార్య మళ్లీ అడవి బాట పట్టడంతో కథను ముగించి ఇక ఇంటికి వెళ్లండని పుణ్యం కట్టుకున్నాడు కొరటాల.
రాం చరణ్‌ను ఆ తండాను రక్షించే యువకుడిలా, ధర్మాన్ని కాపాడే వీరుడిలా చూపించి.. మల్లీ అతను
నక్సలైట్ కొడుకుగా.. అతను చనిపోతూ చిరంజీవికి ఇస్తే… చిరంజీవి తండా పెద్దకు ఇచ్చి వెళ్లిపోతాడు. తండాలో ధర్మం గురించి భారీ డైలాగులు అవీ చెప్పించిన తర్వాత.. కొన్ని ఫైట్లు అయినవి అనిపించిన తర్వాత అన్నల బాట అడవి బాట పట్టిస్తాడు. అక్కడ తండ్రీ, కొడుకులు తమదైన సిద్దాంతం వల్లెవేస్తూ నక్సలైట్లు ఎట్లుంటారో కొత్త నిర్వచనం ఇస్తారు. ఇక రాంచరణ్ బతికుంటే సెంటిమెంట్ పండదనుకున్నాడో ఏమో శివ.. తండాను కాపాడుకుంటానని వెళ్లి మధ్యలోనే చిరంజీవిని కాపాడబోయి చనిపోతాడు. హీరోయిన్ పాత్ర పూజ హెగ్డేను ఎందుకు పెట్టారో.. ఏం చేద్దామనుకున్నారో చివరి వరకు డైరెక్టర్‌కు క్లారిటీ లేనట్టుంది.
క్లైమాక్స్ ఫైటింగ్ సీన్లు అఖండను మించి పోయాయి. రక్తం ఏరులై పారి.. తలలో గాలిలోకి ఎగిరి…బాహుబలి తరహా బల్లేలు శరీరాలు చీల్చి చెండాడాయి.
ఈ సినిమా చూసిన తర్వాత మళ్లీ ఓ క్లారిటీ వచ్చింది. తెలుగు సినిమాకు కథలు కరువుగానే ఉన్నాయి. ఓ రాధేశ్యామ్, త్రిపుల్ ఆర్, ఆచార్య, అఖండ… అవే మూస కథలు. అర్థం పర్థం లేని కథలు….