చరిత్రను వక్రీకరించారు. తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇద్దరి హీరోలకు సమన్యాయం చేయాలని చూసే ప్రయత్నంలో తడబడ్డారు. కమర్శియల్ ఎలిమెంట్స్ అద్దే క్రమంలో బొక్కబోర్లా పడ్డారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఇక్కడి చరిత్ర ఎవరికీ తెలియదనుకున్నారో… తాము చుట్టిన కల్పిత కథే చరిత్రగా అనుకుంటారనుకున్నారో … కొమురం భీంను తగ్గించి అల్లూరిని ఆకాశానికెత్తారు. మొదట రాంచరణ్ ( సీతా రామారాజు) పాత్రను పోలీస్ పాత్రలో నెగెటివ్‌గా చూపించారు. భీం( ఎన్టీఆర్)ను గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ గోండు అమ్మాయిని కాపాడేందుకు వెళ్లిన ఓ సాధారణ అడవి మనిషిలాగే చాలా చోట్ల చూపించి ఆ పాత్ర విలువను తగ్గించేశాడు డైరెక్టర్. బాంచన్ దొర అని బతిమాలుకునే డైలాగులు కూడా పెట్టేశాడు కొమురం భీంకు.
అల్లూరిని ఓ ఉద్యమకారుడిగా చిత్రీకరించాడు. దాన్ని అబ్బురపడి చూసేలా కొమురం భీం పాత్రను మలిచాడు. బ్రిటీష్ పాలకులతో .. పాలనతో ఎలాంటి డైరెక్ట్ సంబంధం లేని కొమురం భీంను … సీతారామరాజుతో కలిపేందుకు… ఇద్దరూ కలిసి నటించేందుకు కావాల్సిన కల్పిత కథను రెడీ చేసుకున్నా.. కొమురం భీం ఉద్యమ నేపథ్యాన్ని కొద్దిగా కూడా చూపించలేదు. కేవలం గోండు అమ్మాయిని బ్రిటిషర్లు తీసుకుపోయారు కాబట్టి…. ఆ పాపను కాపాడేందుంకు ఆ గోండుల రక్షకుడిగా మాత్రమే అతను ఢిల్లీ బయలుదేరి వెళ్తాడు అంతే. అంతకు మించి అతని పాత్రను ఉద్యమ కారుడిగా చూపలేదు. కానీ ఉరి తీసే సమయంలో మాత్రం ఓ పాటను పెట్టి ఆ పాట స్పూర్తితో అందరిలో చైతన్యం వచ్చిందని చూపెట్టారు.
రాం చరణ్‌లో కూడా ఈ పాటే మార్పును తీసుకొచ్చిందని, తన ఆశయం.. అందరికీ ఆయుధాలు అందేలా చూడాలన్నదాన్ని పక్కకు పెట్టి భీంను కాపాడుకుంటానని చెప్పిస్తాడు. మళ్లీ చివరకు ఆయుధాలు కొమరం భీమే … అల్లూరికి అందించేలా క్లైమాక్సులో చూపుతాడు. నా ఆశయ సాధనకు ఇంతలా తోడ్పడ్డావు.. నీకు ఏం చేయాలి ….. అని రాంచరణ్ అడిగితే.. చదువు చెప్పించండన్నా…. అని కొమురం భీం దీనంగా అడుక్కున్నట్టు ఓ డైలాగ్ ఇచ్చాడు. చదవు, సంధ్య లేకుండా ఎలాంటి చైతన్యం లేకుండా మేము బతుకుతున్నామని చెప్పడానికి డైరెక్టర్ ఉత్సాహం చూపించాడు. జల్ , జంగల్ , జమీన్ అని ఓ జెండాను లాస్ట్‌కు చూపించాడు. ఈ నినాదం ఎవరిది..? ఎక్కడ్నుంచి వచ్చింది..? దీని వెనుక కథేమిటి..? అది చెప్పాలనిపించలేదు డైరెక్టర్‌కి. కొమురం భీం పాత్రపై మొదటి నుంచి క్లారిటీ, అవగాహన లేదు డైరెక్టర్‌కి. తడబడుతూ వచ్చాడు. గడబిడలో ఈ పాత్రను తగ్గించి…. అల్లూరిని లేపేందుకు అష్టకష్టాలు పడ్డాడు.
అసలు ఇదంతా ఎందుకు…? ఒక్క కొమురం భీం కథనే తీసుకుని మొత్తం సినిమా లాగించినా.. ఎక్కడా బోర్ రాదు.. కానీ అలా చెప్పాలనుకోలేదు. విజయేంద్ర ప్రసాద్ … సుద్దాల హన్మంతు జీవిత కథతో తెరకెక్కించిన రాజన్న సినిమాలో కూడా చాలా తప్పిదాలే చేశాడు డైరెక్టర్ కం రైటర్‌గా వ్యవహరించిన రాజమౌళి తండ్రి. ఇప్పుడు ఇలా కొమురం భీం పాత్రను అడ్డదిడ్దండా వాడుకున్నారు. అసలు కొమురం భీం అనే పేరు..ఇక్కడి చరిత్ర వాడకుండా ఉంటే పెద్ద ఇబ్బంది ఉండకపోయేది. సినిమాను క్యాష్ చేసుకునేందుకు ఇలా చరిత్రను వక్రీకరించకతప్పలేదు వారికి.