రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలు రాబోతున్నాయా..? ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లేందుకు సర్కార్ సన్నద్దమవుతోందా..? అవుననే సంకేతాలిచ్చింది అసెంబ్లీ చివరి సమావేశం. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చలో ఇన్ని వరాలు మామాలుగా ఇవ్వరు.కానీ ఈ సమావేశం ప్రత్యేకంగా జరిగింది. ప్రత్యేకతను సంతరించుకున్నది. వరాల జల్లులతో చివరి రోజు ముగిసింది. సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల స్థాయి జీతాలు, ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవడం, మధ్యాహ్న భోజన పథక కార్మికుల వేతనం 3 వేలకు పెంపు, వడగండ్లతో నష్టపోయిన రైతులకు పరిహారం…….. ఇలా వరుసగా వరాలన్నీ కురిపించాడు. ఇవన్నీ ఒకెత్తయితే .. రంగారెడ్డి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపించే జీవో 111ను ఎత్తేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ప్రత్యేకాంశం. ప్రస్తావనార్హం. ఇప్పుడిదే చర్చకు దారి తీసింది. చేవెళ్ల ఎమ్మెల్యేతో దీనిపై ప్రశ్న వేయించుకుని మరీ సీఎం ఉత్సాహంగా ప్రకటన చేశాడని భవిస్తున్నారు. ఓ నాలుగు నియోజకవర్గాల్లో దీని ప్రభావం ఉంటుంది. ఇది టీఆరెస్కు అనుకూలంగా మారనుంది. ఎమ్మెల్యేలతో తనకు కావాల్సిన రీతిలో సీఎం ప్రశ్నలు వేయించుకుని మరీ వరాలు కురిపించాడనేది రాజకీయ విశ్లేషకులు భావన.
వాస్తవంగా 111 జీవోపై నిపుణుల కమిటీ ఇప్పటికే సిద్దమైంది. వారంలో రావొచ్చు. ఈ కమిటీలో మెట్రో వాటర్ బోర్డు, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరదిర సంస్థలున్నాయి. ఈ కమిటీ రిపోర్టు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటి వరకు ఈ జీవో ప్రకారం 10 శాతం మాత్రమే నిర్మాణాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత శాతమిస్తారు…? పూర్తిగా ఎత్తేస్తారా..? ఇది అంత ఈజీగా తేలే వ్యవహారం లా లేదు. కానీ సీఎం మాత్రం హడావుడిగా దీనిపై ప్రకటన చేసేశాడు. ఇప్పటికే మూడు సార్లు దీనిపై హామీ ఇచ్చిన సీఎం.. చివరగా ఇది నాలుగో సారి. ముందస్తు ఎన్నికల కోసం చివరి సారి హామీగా దీన్ని చూస్తున్నారు.
ఇది కేవలం ఎన్నికల స్టంటుగానే, టీఆరెస్కు ఉపయోగపడే అస్త్రంగానే చూస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా సీఎం అసెంబ్లీలో తన ముందస్తు వ్యూహాలకు పక్కాగా ప్లాన్ వేసి ఇలా అసెంబ్లీ చివరి సమావేశంలో ఎన్నికల వరాలు కురిపించాడనేది ఇప్పుడు అంతటా జరుగుతున్న చర్చ.
సీఎం హామీలతో అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాలు కూడా అలర్టయ్యాయి. ముందస్తు ఎన్నికల యుద్దానికి బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు.