ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు, నిందలు, వ్యతిరేకతను ఒక్కదెబ్బతో తుడిచిపెట్టుకుపోయేలా ప్రకటన చేశాడు కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాల నోటిఫికేషన్లు పడతాయని భావించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. అనుకున్నంత ఉద్యోగాలు పడలేదు. నోటిఫికేషన్లు వేయలేదు. వేసిన ఉద్యోగాల భర్తీకి చాలా తాత్సారమే జరిగింది. టీచర్ల ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం పట్టించుకోలేదు. నిధుల లేమి ఓ కారణమైతే.. స్థానికత ఇతర అంశాల పరిశీలన విషయంలో కూడా చాలా సమయమే తీసుకున్నారు. ఉద్యోగుల విభజన కూడా లేట్ అయింది. వివాదస్పదమైంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో చాలా మంది లోకల్ నాన్ లోకల్‌గా మారారు.
మరోవైపు నిరుద్యోగుల ఆత్మహత్యలు… ఇవన్నీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎట్టకేలకు కేసీఆర్ లేట్‌గా అయినా.. తనదైన శైలిలో అసెంబ్లీలో ఈ రోజు ఉద్యోగాల కల్పనపై కీలక ప్రకటన చేశాడు.91, 142 ఖాళీలను భర్తీ చేస్తామన్నాడు. వెంటనే నోటిఫికేషన్ విడుదలకు ఆదేశాలు జారీ చేశాడు. దీంతో పాటు 80, 039 డైరెక్టు ఉద్యోగాల కల్పన, 11, 103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నాళ్లుగానో ఈ మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ వారి నెత్తిన పాలుపోశాడు. నిరుద్యోగులకు తీపి కబురు చెప్పాడు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏ ఏడాదికాఏడాది ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించాడాన్ని ప్రతిపక్షాలు కూడా మెచ్చకున్నాయి.
కానీ ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాయి. 2019లో 165 మంది వరకు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోగా.. గత ఏడాది 21 మంది, ఈ ఏడాది ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ బాధిత కుటుంబాల గురించి ప్రభుత్వం ఏమీ మాట్లడలేదనే విషయాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి.