ఈట్ కా జవాబ్ పత్తర్ సే.. అన్నాడు కేటీఆర్. తప్పుడు ఆరోపణలు చేస్తూ.. బురద జల్లితే.. ఒకటంటే పదంటం అన్నాడు. పార్టీ శ్రేణులకు కూడా పిలుపునిచ్చాడు. మంత్రి మల్లారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్.. తదితరులు ఘటుగానే స్పందించారు. ఇకపై ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తే ఇంట్లోకొచ్చి కొడతామని ఒకరు. బట్టలిప్పి ఉరికిచ్చి కొడతామని ఇంకొకరు.. ఇలా నోటికొచ్చింది అనేశారు. సరే, అసలు సంగతికొద్దాం. ఆర్మూర్‌లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి చాలా రోజుల నుంచి. నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది.
జడ్పీ చైర్మన్ తనకు తెలియకుండా కార్యక్రమాలు పెడుతున్నాడని, ఆయన పిలిస్తే ఎవరూ పోవద్దని లీడర్లకు ఆదేశాలిస్తాడు ఎమ్మెల్యే. ఆయనెవరు వద్దనడానికి? నాది మాక్లూర్. నేనూ ఈ నియోజకర్గానికి చెందినవాడనే. అందునా జడ్పీ చైర్మన్‌ను. నాకు ఎవరేందీ చెప్పేదీ..? నేనేమన్నా పర్సనల్ ప్రోగ్రాములు పెడుతున్నానా..? పార్టీ పిలుపు మేరకే కదా.. ..? అని విఠల్ రావు ఎదురు ప్రశ్నిస్తున్నాడు. చాలా కార్యక్రమాల్లో విఠల్ రావు బాహాటంగానే ఎమ్మెల్యే తీరుపై విరుచుకుపడ్డాడు. విఠల్ రావు.. కేసీఆర్‌కు దగ్గరి బంధువు. ఎమ్మెల్యే కేటీఆర్‌తో సన్నిహితంగా ఉంటాడు. ఎవరికి ఏం చెప్పాలో.. ఎవరి మాట వినాలో మధ్యలో ఉన్నవాళ్లకు అర్థం కాదు. కానీ ఎమ్మెల్యేదే అక్కడ పై చేయి. దీంతో విఠల్‌రావు ఏ ప్రోగ్రాంకు పిలుపిచ్చినా.. అది ఫెయిల్‌చేసి తీరుతాడు ఎమ్మెల్యే.
ఇదేందీ..? పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కదా పోతున్నాడు.. చూశారా..? అని విఠల్ రావు మీడియాకెక్కుతాడు. ఇగో .. ఇవే మాటలు.. వార్తలు రూపంలో రాశాడు మాక్లూర్ సాక్షి రిపోర్టర్ పోశెట్టి. దీంతో ఎమ్మెల్యే అనుచరులు దారికాచి దాడి చేశారు. తృటిలో ప్రాణపాయం తప్పి.. గాయాలతో బయటపడ్డాడు. మాక్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. యూనియన్ లీడర్లతో కలిసి సీపీకి మొరపెట్టుకున్నాడు.
ఇలా వీరిద్దరి ఆధిపత్య పోరు.. ఓ విలేకరి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది.
తప్పుడు వార్తలు రాస్తే తంతారేమో అనుకున్నాం కానీ.. వ్యతిరేక వార్తలు రాస్తే చాలు చావతన్నుతారని ఈ ఉదంతం ద్వారా తెలిసింది. జర జాగ్రత్తగా ఉండండి విలేకరులూ…
https://www.dishadaily.com/the-mlas-followers-attacked-the-journalist