ద‌ళితుల జీవితాల్లో వెలుగులు నింపే ప‌థ‌కంగా ప్ర‌చారం చేసుకున్న ద‌ళిత‌బంధు ఇప్ప‌టికీ అమ‌లుకు నోచుకోలేదు. హుజురాబాద్ ఎన్నిక‌ల హామీగా ఇది తెర‌పైకి వ‌చ్చినా… అంత‌కు ముందు నుంచే కేసీఆర్ మ‌దిలో ఉన్న ప‌థ‌కంగానే టీఆరెస్ ప్ర‌చారం చేసుకున్న‌ది. కేసీఆర్ కూడా అదే చెప్పాడు. హుజురాబాద్‌లో పైల‌ట్ ప్రాజెక్ట‌న్నారు. ఆ త‌ర్వాత ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో వంద మంది చొప్పున ద‌ళితుల‌ను ఎంపిక చేసుకుని అమ‌లు చేస్తామ‌న్నారు.

హుజురాబాద్ ఎన్నిక‌ల‌యిపోగానే న‌వంబ‌ర్ నాలుగో తేదీ నుంచి ఈ ప‌థ‌కాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేస్తామ‌న్నారు.ఆ ఎన్నిక‌లో టీఆరెస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ .. ఈట‌ల రాజేంద‌ర్ చేతిలో ఓడిపోయాడు. ఈ ప‌థ‌కం అట‌కెక్కింది. కేసీఆర్ చెప్పిన మాట నెల రోజులు గ‌డిచినా అతీగ‌తీ లేదు. దీనిపై సోష‌ల్ మీడియాలో నిల‌దీతలు మొద‌ల‌య్యాయి. ఏమైందీ…? అమ‌లు చేస్తామ‌ని నెల‌రోజులైంది.. ఇంకా చేయ‌లేదే అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఇది ప్ర‌యార్టీ కాదు ఓ వైపు వానాకాలం ధాన్యం ఇంకా కొనుగోలు చేయ‌లేదు. రైతులు ఆందోళ‌న‌లో ఉన్నారు.

మ‌రోవైపు యాసంగి సీజ‌న్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుంది. కేంద్రం యాసంగిలో వ‌చ్చే రైస్ తీసుకోమంటున్న‌ది. కేసీఆర్ కూడా కేంద్రం తీసుకోవ‌డం లేదు కాబ‌ట్టి.. వ‌రి వేయ‌కండి.. వేస్తే మీ రిస్క్ అని చేతులెత్తేశాడు. మేమైతే కొనుగోలు కేంద్రాలు పెట్టం.. వ‌రి కొనుగోలు చేయ‌మ‌ని స్ప‌ష్టంగా చెప్పేశాడు. ఇప్పుడీ రాజ‌కీయం న‌డుస్తుంది. ఇక ద‌ళిత‌బంధు అమ‌లు కు చాలానే స‌మ‌యం ప‌ట్టేట‌ట్టుంది. ఇదిలా ఉండ‌గానే….ఒమిక్రాన్ వేరియంట్ ఒక‌టి వ‌చ్చింద‌ని ఆగ‌మాగం చేస్తున్నారు. ఇది ఇలాగే ప్ర‌చారం జ‌రిగి భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తే.. మార్కెట్ మ‌రింత డీలాప‌డి ఖ‌జానాపై తీవ్ర ప్ర‌భావం చూపి .. ఉన్న ప‌థ‌కాల అమ‌లుకే నానా అవ‌స్థ‌లు ప‌డే దుస్థితి ఏర్ప‌డితే… ఇక ద‌ళిత‌బంధు అమ‌లు గురించి ఇప్ప‌ట్లో మాట్లాడుకోక‌పోవ‌డ‌మే బెట‌ర్ అనే ప‌రిస్థితి రావొచ్చు.

You missed