ఆయన మాటలు మిమిక్రీ ఆర్టిస్టులకు ఎంతో ఇష్టం.. అదే విధంగా.. చూచినట్లైతే…. అని ముద్దు ముద్దుగా ఆ అచ్చ తెలుగు మాటలు ఆయన కాకుండా మరెవ్వరూ మాట్లాడరేమో అనిపిస్తుంది. కోపంలో ఉన్న వ్యంగ్యంగా మాట్లాడినా.. నవ్వుతో చెప్పినా.. ఆ మాటల్లో తీయదనం కనిపిస్తుంది. ఆయన మాట్లాడే తెలుగులో ఇంగ్లీషు పదాలు బహుశా భూతద్దం పెట్టి వెతికినా దొరకవనుకుంటా. పిల్లలకు పాఠాలు చెప్పినట్టు.. అక్షరాలన్నీ పద్దతిగా కూర్చి పలికినట్టు.
ఎంతో పక్కాగా స్క్రిప్టు రాసుకుని వచ్చి మాట్లడినట్టు… ఎక్కడా తడబడకుండా.. తప్పుల్లేకుండా.. అనవసరమైన మాటలు దొర్లకుండా.. ఆ మాట్లాడే తీరు ఆయనకే చెల్లింది. పెద్ద మనిషిలానే ఉండేవి ఆ పదాలు కూడా. విమర్శించినా.. వ్యంగ్యాస్త్రాలు సంధించినా.. అవి సందర్భానికి అనుకూలంగానే. సబబుగానే ఉండేవి తప్ప.. వ్యక్తిగతంగా దాడికి తెగబడినట్టుగా కనిపించేవి కావు. ఇక తను వ్యంగ్యాస్త్రాలు సంధించాడంటే అవతలి వ్యక్తి తనను కెలుక్కున్నాడన్నమాట. అయితేనే ఆ మాటలు తూటాలు బయటకు వస్తాయి.. అవీ ముద్దుగా..తిట్టినట్టు కాకుండా.. పరోక్షంగా వెక్కిరించినట్టు.. హితవు పలికినట్టు… నీ లోపాలు ఇవీరా నాయన.. తెలుసుకో.. ఎక్కువ మాట్లాడకు అని కంట్రోల్లో పెట్టినట్టు.. ఇకపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తరోయ్ అని హెచ్చరించినట్టు…….