కలెక్టర్లంటే సీఎం కాళ్లు మొక్కుతారు.. ఐఏఎస్‌లు వదిలి రాజకీయ పదవుల కోసం వెంపర్లాడతారు అనే అనుకోవద్దు. అందరు కలెక్టర్లు అలా ఉండరు. కాళ్లు మొక్కే కలెక్టర్లే కాదు.. కలెక్టర్ గిరీ అనే అధికార చట్రంలోంచి బయటకు వచ్చి తను ప్రజలకు ఓ సర్వెంట్‌ననే సోయున్నకలెక్టర్లూ ఉన్నారు. అవసరమైతే పాయఖానలు కడిగేందుకు కూడా వెనకకు రారు. అయ్యో .. కలెక్టరేందీ.. పాయఖానలు కడుగుడేందీ అని అంతా ముక్కుమీద వేలేసుకున్నా.. అది ప్రజల కోసమే. అందరూ ఆచరించడం కోసమే. ఆదర్శంగా నిలవడం కోసమే.
కాళ్లు మొక్కినా.. అట్లనే నోరెళ్లబెట్టిండ్రు. అయ్యో కలెక్టరేందీ..? కాళ్లు మొక్కుడేందీ.. అంత ఖర్మ ఏమొచ్చిందన్నారు. కానీ దానికి దీనికి ఆకాశానికి, భూమికీ ఉన్నంత తేడా ఉంది. కాళ్లు మొక్కి .. వరి పండిస్తే ఖబడ్దార్ అని బెదించిన కలెక్టర్ త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నాడు. ఈ పాయఖానలు కడిగిన కలెక్టర్.. తెలంగాణలో అవమానించబడి ఆంధ్రాలో ఇలా పాయఖానలు కడుగుతూనే మంచి పేరు తెచ్చుకుని శభాష్.. కలెక్టరంటే ఇలా ఉండాలని అందరితో మెప్పు పొందుతున్నాడు.
ఇంకొందరు కలెక్టర్లు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపుతున్నారు చదువుల కోసం. మరికొందరు ఐఏఎస్‌లు ప్రసూతి కోసం ప్రభుత్వ దవఖానలకు వెళ్తున్నారు. అంతో ఇంతో జనాలకు దగ్గరగా ఉండి.. వారికి మెరుగై వసతులు, సేవలు అందేలా తమవంతు కృషి చేస్తున్నారు. ఒక్కరిద్దరు కాళ్లు మొక్కారని కలెక్టర్లంతా దిగజారి పోయి ఉన్నారని, స్వార్థం కోసం ఏమైనా చేస్తారని, పదవుల కోసం కలెక్టర్ గిరీని వదిలి రాజకీయాల్లో కలిసి పదవులు పొందుతారని అనుకోవడం కరెక్టు కాదు. కానీ, మన దగ్గర మాత్రం కాళ్లు మొక్కినోళ్లకే అందలమెక్కిస్తారు. ఇది మాత్రం వాస్తవం.