కాంగ్రెస్ నాయకులు కొందరు ధర్నాచౌక్‌ను ఫినాయిల్‌తో కడిగేశారు. ఎందుకు..? అక్కడ టీఆరెస్ ధర్నా చేసిందని. రైతు మహా దీక్ష పేరుతో ఇవాళ టీఆరెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. కేంద్రాన్ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిపోశారు. మధ్యాహ్నం వరకు ధర్నా ముగించేసి ఎక్కడి వారక్కడ జారుకున్నారు. ఆ తర్వాత వచ్చారు కొందరు కాంగ్రెస్ నేతలు. ఫినాయిల్‌తో ఆ ప్రాంగణమంతా పిచికారి చేశారు.
టీఆరెస్ పార్టీ నేతలు వచ్చి ఇక్కడ ధర్నా చేయడంతో ఇది మలినమైపోయిందని, అందుకే ఆ మలినాన్ని కడిగి శుభ్రం చేశామన్నది వారి వాదన. అసలు ధర్నా చౌకే వద్దన్నవారికి ఇప్పుడు ఇదే ధర్నాచౌక్ దిక్కయ్యింది.. అని టీఆరెస్ విమర్శలెదుర్కొన్నది. తానొకటి తలిస్తే .. ఇంకేదో అయినట్టు.. కేంద్రంపై ఒత్తిడి పెంచి బీజేపీని ఇరకాటంలో పెట్టాలని టీఆరెస్ చూస్తే.. ఈ ధర్నాచౌక్ వద్దకు వచ్చి ధర్నా చేసే అర్హతే మీకు లేదనే విధంగా అక్కడ పరిస్థితి ఏర్పడింది. ఇలా ఫినాయిల్‌తో కడిగేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అప్పటికీ నిన్నలే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పనే చెప్పాడు. మేము ధర్నాచౌక్ ఎత్తేస్తామని అనలేదని, అక్కడ ప్రజల అభీష్టం మేరకే ఆ నిర్ణయం తీసుకున్నామని, కానీ ఇప్పుడు టీఆరెస్ మాటలు ఎవరూ వినేలా లేరు. వారు నిజం చెప్పినా కూడా. అలా చేజేతులా చేసుకున్నారు మరి. ఎవరేం చేస్తారు..?