కేసీఆర్ మీద తీసిన పేరు తెలంగాణ దేవుడు. శ్రీకాంత్ మెయిన్ రోల్ చేశాడు. ఈ రోజే రిలీజ్. ఎలా ఉందో చూసేందుకు ఈ ట్రయిలర్ చాలు. అమ్మో.. మామూలుగా లేదు. అసలు ఆ పేరే ఈ సినిమాకు మైనస్. మరీ డాక్యూమెంటరీ సినిమాలా తీసిపారేశారని తెలిసిపోతుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రముఖ దర్శకుడు శంకర్ తీసిని జై బోలో తెలంగాణ సినిమా కూడా ఇలాగే తేలిపోయింది. అసలు ఆ సినిమా స్క్రీన్ ప్లే చాలా బలహీనం. పాటలు మాత్రం బాగుండె.
సరే, అది ఉద్యమ సమయం కాబట్టి.. చూశారు. చక్రి సంగీతంలో పాటలు బాగుండె. ఇన్ని రోజులకు ఈ తెలంగాణ దేవుడి పేరుతో కేసీఆర్‌ను అమాంతం ఆకాశానికి ఎత్తే సినిమా తీసి బొక్క బోర్లా పడటం తప్ప ఎవరూ దీన్ని అంత ఇష్టంగా చూసే సీన్ అయితే కనిపించలేదు. మరీ అంత అతిశయోక్తులతో కూడిన సీన్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అసలే కేసీఆర్ అంటే ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఈ సమయంలో ఈ సినిమా రిలీజ్ అంటే.. కేవలం హార్డ్ కోర్ టీఆరెస్ నాయకులు మాత్రం చూడాల్సి ఉంటుంది. కేసీఆర్ గురువు మృత్యుంజయ శర్మ గా బ్రహ్మానందం నటిస్తున్నాడు. అతను నిన్న ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ సినిమా బాగుంది చూడండి.. దర్శకుడు అద్భుతంగా తీశాడని.
రిలీజ్ మాత్రం చాలా ఆలస్యమయింది. కారణాలేమిటో తెలియదు. ఈ రోజు టీఆరెస్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్ష చేస్తున్నది కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు. యాసంగిలో బియ్యం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ. కాకతాళీయంగా ఇదే రోజు ఈ సినిమా రిలీజ్ ఉంది. పెద్దగా ప్రచారమైతే చేసుకోలేదు. ఓటీటీలో రిలీజ్ చేశారమో.. చూస్తే పోలా.. అనుకున్నాను. కానీ కనిపించలేదు. థియేటర్ వెళ్లి రెండు గంటలు ధిమాక్ ఖరాబ్ చేసుకోవడం ఇష్టం లేక ఈ రోజు ఈ సినిమా చూడటం లేదు. ట్రయిలర్ చూస్తే అర్థమైపోయింది. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పిసికి చూస్తే తెలిసిపోతుంది కదా..!
శ్రీకాంత్ మట్లాడిన తెలంగాణ భాష ఘోరంగా ఉంది. కేసీఆర్ లా తల ఆడిస్తే చాలు అతనిలా నటించొచ్చని అనకున్నట్టున్నాడు. డైలాగులు రాసిందెవరో గానీ.. తెలంగాణ భాష ఆత్మ పట్టుకోలే.
చివరగా.. ఈ సినిమా కేసీఆర్ చూసినా.. ఛీ ఇంత దరిద్రంగా.. ఇంత ఘోరంగా తీసి నన్ను అవమానించార్రా అని అనుకుంటాడేమో… ! భజన మోతాదు మరీ ఎక్కువైపోయింది.
ఈ ట్రయిలర్ చూసిన తర్వాత .. అప్పుడే ఓ టీవీ ఛానల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ వరదల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసేందుకు తనే స్వయంగా వీధులు తిరుగుతూ.. అన్నం వడ్డిస్తూ కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న వార్త ఒకటి వస్తున్నది. మా ఆవిడ అన్నది అన్యపదేశంగా.. ఈయన తమిళనాడు దేవుడు.. అని. నాకు కొద్దిసేపటి వరకు అర్థం కాలేదు.