కేసీఆర్ ఎట్టకేలకు ముసుగు తీశాడు. కేంద్రంలో దోబూచులాటకు తెర తీశాడు. బీజేపీతో లోపాయికారిగా ఉన్న దోస్తానాకు కటీఫ్ చెప్పాడు. బండి సంజయ్‌పై నిప్పులు చెరిగాడు. యాసంగిలో వరి వేయొద్దు అనే ఇష్యూ పై రాష్ట్రంలో రాజుకున్న నిప్పు కేసీఆర్‌ను మండించింది. అగ్గిపిడుగయ్యాడు. ప్రెస్‌మీట్ పెట్టి గంట పాటు తిట్టినతిట్టు తిట్టకుండా..లోపాలన్నీఎత్తి చూపి.. పాపాలన్నీ కళ్లముందుంచి.. ఇక కాస్కో బిడ్డా.. నిన్ను వదలమిక అని వార్నింగ్ ఇచ్చి.. ఆవేశంతో రగిలిపోయి.. వీరావేశంతో శపథాలు చేసి.. అరవీర భయంకరంగా నిప్పులు చెరిగి.. ప్రెస్‌మీట్ ముగించాడు.
మీడియాకు చాలా రోజుల తర్వాత మంచి సరకు దొరికింది. కావాల్సినంత సబ్జెక్టు దొరికింది. రాయాల్సినన్ని వార్తలు దొరికాయి. ఇకపై రోజూ తనే ప్రెస్‌మీట్ పెట్టి కేంద్రాన్ని ఏకి పారేస్తానన్నాడు. రాస్కోరా సాంబా..! అని విలేకరులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. హుజురాబాద్ ప్రస్టేషన్ మామూలుగా లేదు. కేసీఆర్ విశ్వరూపం చాలా రోజలు తర్వాత చూపించాడు. ఇకపై కేంద్రంపై పోరాటమే అన్నాడు. ఇన్ని రోజలు దోస్తానాను సమర్థించుకున్నాడు. అదంతా తెలంగాణ కోసమే అన్నాడు. బండి సంజయ్‌ను వదిలిపెట్టేది లేదన్నాడు. ఇక సూస్కుంటం బిడ్డా అని గట్టిగానే బండి లెవల్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు.
పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది కేంద్రమే అని గణాంకాలతో సహా మొత్తానికి ఇన్నాళ్లకు బయటపెట్టాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు మిన్నకుండిపోయాడో..? రైతు చట్టాలపై పోరాటమన్నాడు. మరి ఇంత కాలం ఇవి రైతు వ్యతిరేక చట్టాలని ఎందుకు గుర్తుకురాలేదో..? హుజురాబాద్‌లో బెడిసికొట్టిన కేసీఆర్ వ్యూహం ఇద్దరి మధ్య అగాథాన్ని పెంచిందని మాత్రం అర్థమయ్యింది. యాసంగిలో వరి వద్దు అని ప్రభుత్వం ఎందుకున్నదో వివరించి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టాడు. బండి సంజయ్ ఇదేమీ పట్టకుండా రైతులను మోసగించేలా వరి వేసుకోండని, మెడలు వంచి వడ్లు కొనేలా చేస్తామని అనడం కేసీఆర్ కు మంట రేపింది. అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అటు కేంద్రాన్ని కడిగేశాడు.
ఇటు రాష్ట్ర బీజేపీనీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కూడా గట్టిగానే అర్సుకున్నాడు. హుజురాబాద్ ప్రస్టేషన్ అంతా కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో కనిపించింది. కానీ హుజురాబాద్ ఓటమిని లైట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు అదే ఆవేశపూరిత వదనంతో.
ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమయ్యింది.
ఇన్ని రోజులు దోస్తానా చేస్తే..మీరిచ్చే బహుమతి ఇదా..?
మీ పార్టీ నేతలు ఇలా కుక్కల్లా మాట్లాడినా పట్టించుకోరా…?
హుజురాబాద్‌లో టీఆరెస్ గెలుపును కుట్రపూరితంగా అడ్డుకుంటారా..?
రైతులకు ఇంత చేసి.. వారి మెప్పు పొందుతుంటే.. వారినే మాకు శత్రవులుగా ఉసిగొల్పే చర్యలకు దిగుతారా..?
మీతో దోస్తానా కో సం ఎంత బద్నాం అయినమో మరిచారా..? కనీసం విశ్వాసం కూడా మీకు లేదా..?
ఏడేండ్లుగా మీతో లొల్లెందుకని ఇక్కడ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా చూస్తూ ఊరుకున్నాం… అయినా మీరు మారలేదు. మీ ప్రాపకం కోసం ఎన్ని చట్టాలకు మద్దతు తెలపలేదు.. మరిచిపోయారా..? ఎంత విశ్వాసఘాతుకం..? ఎంత మిత్ర ద్రోహం….?
అందుకే.. అందుకే..
ఇకపై ఉపేక్షించం.. రైతులు మొన్నటి వరకు పోరాడితే మేము తమాషా చూశాం… ఇకపై వారితో కలిసి పోరాడుతాం.
మా తడాఖా చూపిస్తాం..
ఖబడ్డార్…
ఇదీ మొత్తంగా కేసీఆర్ ప్రెస్‌మీట్ సారాంశం…