హుజురాబాద్ ఫలితాల తర్వాత ప్రభుత్వం నిస్తేజంలోకి వెళ్లిపోయింది. కదలికలేమీ లేవు. ఇంకా తేరుకోనట్టుంది బహుశా. సీఎం కేసీఆర్ రేపు ఫామ్ హౌజ్ వీడనున్నాడు. పాలమూరుకు వెళ్లి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించనున్నాడు. కేటీఆర్ సిరిసిల్లా పర్యటనతో యాక్టివ్ అవుతున్నాడు. 9న కామారెడ్డిలో పార్టీ క్యాడర్ మీటింగులో పాల్గొనన్నాడు. ఇప్పుడు సీజన్.. ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో వరి పంట వేయాలా వద్దా అనేది నడస్తుంది.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముందున్నంత స్పీడుగా కొనసాగడం లేదు. కళ్లాల వద్దకు కాంటాలు రావాలంటే సమయం పడుతుంది. అప్పటి వరకు వేచి చూడాలి. కామారెడ్డిలో జిల్లాలో ఓ రైతు గుండె ఆగింది. ఇది రాజకీయ దుమారం రేపుతోంది. చాలా చోట్ల ధాన్యం అమ్మేందుకు రైతులు వేచి చూసే దోరణిలోనే ఉన్నారు. ఇది మరింత రాజకీయ రంగు పులుముకోకముందే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటే బెటర్. ఇక యాసంగి సీజన్ కు ఎంతో సమయం లేదు. ఈనెల 15 నుంచి యాసింగి సీజన్ చాలు అవుతుంది. తుకాలు వేసుకుంటారు. వచ్చేనెల 15 వరకు నాట్లు వేస్తారు. సీడ్స్ అమ్మోద్దని మాత్రం కలెక్టర్లు డీలర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి వదిలారు. సిద్దిపేట కలెక్టర్ తరహాలోనే.
కానీ, ఈ రైతులకు సీడ్స్ సమస్య లేదు. వారి వద్ద వరి విత్తనాలు రెడీగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచే క్లారిటీ కరువయ్యింది. ఓ సారి సీరియస్‌గా వరి వద్దంటారు. మళ్లీ దీనిపై ఊసే ఎత్తరు. సీఎస్ హడావుడిగా కలెక్టర్లకు ఆదేశాలిస్తాడు. కలెక్టర్లు వ్యవసాయాధికారులతో మీటింగులు పెట్టి రైతులకు సమాచారం ఇస్తాడు. రైతులు తెల్లముఖాలు వేసి బిత్తరపోయి చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఏం చేయాలో అటు రైతులకు, ఇటు వ్యవసాయాధికారులకు పాలు పోవడం లేదు. ప్రభుత్వం సూచించినట్టు వరి వెయ్యకుండా ఆరుతడికి వెళ్లాలంటే మాత్రం కుదిరే పనిలా లేదు. ఇక్కడ నేల రైతులకు సహకరించదంటున్నారు అధికారులు. మరి ఎలా..? ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఇదీ రాజకీయంగా రచ్చ కాకముందే ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా? రైతులు రోడ్డుమీదకెక్కేదాకా చూస్తారా??