త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ త‌న పాల‌న‌పై ప్ర‌త్యేక ముద్ర వేసుకుంటున్నాడు. కొత్త సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీస్తున్నాడు. ఎవ‌రో ఏమో అనుకుంటార‌నో.. త‌న‌కు పాలాభిషేకం చేసి పొగ‌డ్త‌ల్లో ముంచెత్తాల‌నో చేయ‌డం లేదు. త‌న‌కు న‌చ్చింది చేస్తున్నాడు. జ‌నాల‌కు మేలు జ‌రిగేది చేస్తున్నాడు. అంద‌రికీ లాభం జ‌రిగేలా చూస్తున్నాడు. బ‌డ్జెట్‌పై భారం ప‌డ‌కుండా చేస్తున్నాడు.

ఎమ్మెల్యేల‌ను మ‌చ్చిక చేసుకునే మాటే లేదు. మొన్న‌టికి మొన్న అసెంబ్లీలో ఎవ‌ర‌న్నా త‌న గురించి పొగుడుతూ మాట్లాడితే బాగుండ‌ద‌ని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అరే ఇదెలా సాధ్యం. ఎమ్మెల్యేలంటే .. ఎంతో కొంత‌.. కొంత‌లో కొంత‌.. ఆఖ‌రికి ఇసుమంత‌.. పొగడాలె క‌దా. అది కూడా వ‌ద్దా..? మ‌రి మా ద‌గ్గ‌రైతే ఇలా కుద‌ర‌దు స్టాలిన్‌. పొగ‌డ‌క‌పోతే మాకు మ‌నుగ‌డ లేదు. మాసారుకు సంతృప్తి లేదు. పొగ‌డొద్ద‌ని ఒక‌వేళ అన్నా.. చాలా చాలా పొగ‌డాల‌ని మాకు అవ‌గ‌త‌మ‌వ‌తుంది త‌ప్ప‌… పొగ‌డ‌కుండా , కీర్తించ‌కుండా.. పాలాభిషేకాలు చేయ‌కుండా.. మేం ఉండ‌లేం. మాతో కాదు. మా న‌ర‌న‌రాన అది ఇమిడిపోయింది.

స‌రే ఇదంతా ఎందుకు గానీ, అసెంబ్లీలో ఉన్న క్యాంటిన్ కూడా బందేపిస్త‌వా..? నువ్వెంత కంజూస్ ఉన్న‌వ‌య్యా.. సామీ..! మా సారును చూసి నేర్చుకో. రైతు బంధు పేరుత వంద‌ల ఎక‌రాల ఆసాముల‌కు కూడా ల‌క్ష‌లు లక్ష‌లు ఇస్తాడు. ఏమ‌న్నా అంటే వాళ్ల‌కు భూమి ఉంది క‌దా.. వ్య‌వ‌సాయం చేయ‌క‌పోతే ఏందీ..రైతే క‌దా..అందుకే రైతు బంధు అంటాడు. స‌రే వాళ్లు కూడా ఏం ఉంచుకోరు లెండి.. యాదాద్రికి బంగార‌మో.. పార్టీకి చందానో.. ఎన్నిక‌ల‌కు ఖ‌ర్చులో ఏదో ఒక‌టి చేసి ప్ర‌భుత్వ రుణం తీర్చేసుకుంటారు. అవునూ.. స్టాలిన్ .. నీలాంటోడు రాజ‌కీయాల‌కు ప‌నికి రాడ‌య్యా.. నాలుగు కాల‌ల పాటు మీ పార్టీ అధికారంలో ఉండాలంటే నువ్వొక సారి మా ద‌గ్గ‌రికొచ్చి.. మా సారు పాల‌న పై అధ్య‌య‌నం చేయాలి. త‌ప్ప‌దు. అబ్బే.. ఇలాగైతే బొత్తిగా నువ్వు బ‌త‌క‌లేవు. పార్టీని బ‌తికించుకోలేవు.

You missed