హుజురాబాద్ రాజకీయాలు ఆది నుంచి అంతం వరకు ఆసక్తిగా మారాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నడూ లేని.. ఏ ఎన్నికలో జరిగని చిత్ర విచిత్రాలు ఇక్కడే జరుగుతున్నాయి. వింతలు, విశేషాలు ఇక్కడే చోటు చేసుకుంటున్నాయి. ఫేక్ వార్తల సృష్టికి ఇదే మూలమైంది.
ఒక్కటి కాదు.. రెండు కాదు.. వందల తప్పుల వార్తలు, మార్పింగ్ పోటోలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆరోపణలు గుప్పించుకున్నారు. దెప్పి పొడుచుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. నిధులు వరదలా పారింది ఇక్కడే. హామీలు ఉప్పెనలా వచ్చి పడిందీ ఇక్కడే. అబద్దాలు అవలీలగా ఆడింది ఇక్కడే. కొత్త పథకాల రూపకల్పన జరిగిందీ ఇక్కడే. పాత పథకాలు పరుగులు తీసింది ఈ ఎన్నిక కోసమే. అంతలా ఎన్నడూ లేనంత ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకున్నదీ ఎన్నిక.
ఎల్లుండి పోలింగ్. ఇక పైసల పంపకాల్లో రెండు పార్టీలు పోటీలు పడుతున్నాయి. టీఆరెస్‌ను అందుకోవడానికి బీజేపీ తరం కావడం లేదు. అయినా ప్రయత్నిస్తున్నది. దీంట్లో కూడా ఫేక్ వార్తలు. సరే ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ సీన్ రసకందాయంలో పడింది. పైసలు ఇవ్వాల్సిన దాని కంటే తక్కువిచ్చారంట.. నాకింతే వచ్చినయి.. నాకింతే ఇచ్చిండ్రు.. వాళ్లు ఇచ్చిండ్రు.. వీళ్లియ్యలేదు… చేతికైతే కవర్లందుతున్నాయి గానీ సంతృప్తి చెందడం లేదు. ప్రజలు ఇచ్చిన వారినీ తిడుతున్నారు. ఇయ్యని వారినీ అర్సుకుంటున్నారు. మొన్నటి వరకు ఒకర్నొకరు తిట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఓటర్లు తిడుతున్నారు. హుజురాబాద్ క్లైమాక్స్ సీన్లో ఇంకెన్ని మలుపులో..