యాసంగిలో వరి వద్దు.. వేస్తే ఉరే.. ఊరుకునేది లేదు. జైలుకు పోతరు. షాపులు మూయిస్తం.. ఎవరు చెప్పినా వినను.. నా గురించి మీకు తెలియదు… నేను మోనార్క్ను.. ఇలా ఎన్ని మాటలు కలెక్టర్లు మాట్లాడినా వాళ్లను తప్పు బట్టాల్సిందేమీ లేదు. అంతా మన పాలకుల చలవ. వారి సలహాల మేరకు పాలన అలా ఉంది. పాలనాధికారుల పలుకులు అలా ఉన్నాయి. అంతే.
కాళ్లు మొక్కినంత మాత్రానా వాళ్లు కలెక్టర్లు కాదా బై. వారికి ప్రజల అవసరాలు తెలియవా..? పాలన తెలియదా..? మోకాలికి బోడి గుండుకు ముడెందుకు పెడతరు… ఇప్పుడు సమస్య కాళ్లు మొక్కుడు కాదు.. వరి వెయ్యొద్దు. మరి మన సిద్దిపేట కలెక్టర్ లెక్క గట్టి వార్నింగ్ ఇస్తే తప్ప రైతులు, డీలర్లు వింటరా..? ఇంకో విషయం తెలియదనుకుంటా.. దాదాపు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఇగో ఇట్లనే వార్నింగిచ్చిండ్రు. కానీ ఎక్కడా ఎవరూ వీడియో తీయలేదు.
ఇక్కడ మాత్రం ఎవడో అధికారి సాహసం చేసిండు. షరా మామూలుగా మళ్లీ సిద్దిపేట కలెక్టర్ వార్తల్లో నిలిచిండు. సీఎం నజర్లో పడ్డడు. శభ్బాష్ అని కేసీఆర్తో అనిపించుకునే అదృష్టం ఈ కలెక్టర్కు లభించింది. ఈ కలెక్టర్ వార్నింగు చూస్తుంటే ఒక్కటే అర్థమైంది. వరి వద్దు.. వద్దు.. వేయొద్దు.. వేయొద్దు.. విత్తనం అమ్మొద్దు.. అమ్మొద్దు..అమ్మితే చస్తారు. చస్తారు. వేస్తే పోతారు.. పోతారు.. అనే విధంగానే అర్థమవుకతుంది తప్ప… ఈ పంట వేయండి.. మేమున్నాం.. ఇది వేస్తే మేం మద్దతు ధర ఇస్తాం. ఇది వేస్తే లాభసాటి ధర ఇప్పిస్తాం… అని మాత్రం చెప్పలేదు. ఎందుకు..? మాకన్నీ తెల్వదు. వరి సర్కారు కు భారమవుతుంది. అది తగ్గించాలంటే ఇలా దగడు పుట్టించాలె. భూములు ఏ పంటలూ వేయకున్నా పడిత్గా ఉన్నా సరే.. వరి మాత్రం వేయొద్దు. మొక్కజొన్న కు పోతామనుకుంటున్నరా..? పారతేస్తం.. అది కూడా వేయొద్దు. ఇగో ఇలా ఉంది వరుస మన సర్కార్ది. ఇది ఎటుపోయి ఎటు దారి తీసి.. చివరకు ఏం చేస్తదో.. రైతులు రోడ్డు మీదకు ఎక్కే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తుంది కలెక్టర్ సాబ్.. సీఎం సాబ్….