“అన్నా ఏందే.. హుజురాబాద్ల ఏడ జూసినా గ్యాస్ సిలిండర్లు కనిపిస్తున్నయ్…. టియ్యారెసోళ్లు బాగనే ప్రచారం చేస్తుండ్రు దీనిమీద..”
“అవునే.. గ్యాస్ ధర పెరిగింది కదా. వెయ్యి దాటిందనుకుంటా.. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇట్ల గ్యాస్ సిలిండర్లతో ప్రచారం చేస్తుండ్రు..”
“అవ్.. పెరిగిందే ..! నేను కాదంటలేను.. బగ్గనే పెరిగింది. గతంలో ఎన్నడూ లేకుండె. అది కాదు నా బాధ.”
“మరేంది నీ బాధ..?”
“గ్యాస్ మనకు ఒక్కసారి తీసుకుంటే మూడు నెలలన్నా వస్తది కచ్చితంగా.. సరే మరీ వాడితే రెండు నెలలన్నా వస్తది. కదా.”
“అవును.. వస్తది… అయితే…!”
“మరి మూడు నాలుగు నెలలకోసారి కొనే గ్యాస్ ధర గురించే అంత మాట్లాడితే రోజు మేము తాగే మందు గురించి ఎవడూ మాట్లాడతలేడేందే..?”
“మందు గురించా..?”
“అదేనే వైన్స్ ధరలు పెంచిండ్రు కదా.. దాని గురించి…”
“దానికీ దీనికి ఎందుకు ముడిపెడతావు… దేని దారి దానిదే..”
“ఎందుకు .. వీటికి పైసలు పెడతలేమా..? రోజూ తాగి సర్కారుకు ఆదాయం పెంచుతలేమా..?”
!సరే, ఇప్పుడేం చెయ్యమంటావ్… నీ బాధ చెప్పరాదు..”
“ఇది నా ఒక్కడి బాధ కాదే.. అందరి మందు బాబుల బాధ.. నా తరపున ఈటలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్న …”
“ఏం చెప్పాలనుకుంటున్నవ్…?”
!అన్నా .. వాళ్లు గ్యాస్ ధరలపై ఆందోళనలు చేస్తుండ్రు కదా.. నువ్వు మద్యం రేట్లు పెంచిండ్రు అని లొల్లి చెయ్యి.. అని ఈటల రాజేందర్‌తో చెప్పాలె. ”
“ఏ ఊకో.. చిల్లరగుంటది..”
“అగో ఏం చిల్లర.. వంద రూపాల బీరు నూటయాభై అయ్యింది. కోటర్ కూడా అట్లనే పెంచిండ్రు.. కరోనా టైంల పనులే లేక సస్తున్నం రా అంటే….. గింతగానం రేట్ల…? సర్కారుకు కూడా ఇదే ఆదాయం కదా.. అందుకే మా మందు బాబుల గురించి ఆలోచించలే.. దానిక్కావాల్సింది అదే చేసింది. …”
“నిన్నెవడు తాగమంటుండు మరి అంతగానం పెట్టి..”
“అగో తాగకపోతే నడుస్తదా ? అలవాటైన పాణం. ఇంకెంత పెంచినా పెట్టి కొంటం. తాగుతం. బాకైనా చేసి తాగుతం.. పనిలేని నాడు. అంతే గానీ తాగకపోతే పానం ఊకుంటదా…?”
“మరేం చెయ్యమంటవ్….”
“గ్యాస్ ధర అంత పెరిగిందని అంతలా లొల్లి చేస్తున్న టీఆరెస్‌కు .. ఈటల రాజేందర్ ఈ మద్యం రేట్లపై సర్కార్‌ను నిలదీస్తే దెబ్బకు దెబ్బ సరిపోతది కదా..”
“సరే.. సరే .. చెప్దాం…”
“ఏందే లైట్ తీస్కోవడ్తివి..? ఇది రోజు తాగుడు మాట.. పూటకు రెండుసార్లు వైన్స్‌లకు పోందే ఎల్లదు. మరి మేమెంత బాధపడుకుంట ఆడ పైసలు పెడుతున్నం.. జర ఆలోచించిండ్రి మా గురించి కూడా….”
“ఏ ఊకో.. నువ్వూ నీ లొల్లి….. “