అసలు మనం గుర్తించడం లేదు కానీ, సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది మేథవులు తమ ఫేక్ న్యూస్, మార్ఫింగ్ పోస్టులు, వినూత్న తప్పుడు వార్తలను సృష్టించి మంచి క్రియేటర్స్‌గా మారుతున్నారు. మనం వాళ్లను పట్టించుకోవడం లేదు. హుజురాబాద్ వీరికి ఓ మంచి వేదికగా మారింది. వారి లోలోపల ఉన్న సృజనాత్మకతను బయటకు తీసి.. ఒకరిపై మరొకరు బురద జల్లుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది. పోటీలు పడి ఒకరికి మించి మరొకరు.. షేర్ అంటూ సవ్వాషేర్ అనే రేంజ్‌లో తప్పుడు, ఫేక్ వార్తలతో కొట్టుకుంటున్నారు. బురదలో పడి పందుల్లా బొర్లుతున్నారు.
కానీ, ఏమాటకామాటే…. వాళ్లు చేసే కొత్త కొత్త తప్పుడు ఆలోచనలు మాత్రం ఔరా అనిపిస్తున్నాయి. మీకెక్కడి నుంచి వస్తున్నాయిరా బాబు.. ఇలాంటి చెత్త ఆలోచనలు అని ఓ దశలో తిట్టుకున్నా.. నవ్వుకోలేక ఉండలేకపోతున్నాం.. నవ్వాపుకోలేకపోతున్నాం.. కొన్ని సార్లైతే పొట్టచెక్కలై, ముక్కలై.. కిందపడి దొర్లేదాక తెలవడం లేదు. అంత క్రియేటివిటీని బయటకు తీసి మనమీద దాడి చేసేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ .. ఆర్జీవీని కూడా విచ్చలవిడిగా వాడేసుకున్నారు. తమ వాడకానికి ఎవరూ కాదు అనర్హులు అని అనుకున్నట్టున్నారు. హద్దల్లేవని డిసైడ్ అయిపోయారు. ఏ అవకాశం ఉన్నా.. వదలడం లేదు.
ఆర్జీవీ ట్వీట్ చేశాడంటూ.. ఓ సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఆర్జీవీకి రాత్రి ఓడ్కా పడగానే ఓ కొత్త సినిమా టైటిల్ గుర్తొస్తుంది. అది వెంటనే ట్విట్టర్ గూట్లోకి వచ్చి గుడ్డు పెడుతుంది. వెంటనే అది పెంట పెంట అవుతుంది. అదిగో అదే అలవాటును మన టీఆరెస్ వాళ్లు వాడేసుకున్నారు. ఇలా. చంద్రబాబు, ఎన్టీఆర్ వెన్నుపోటుకు లింకు చేశారు… ఈటల, కేసీఆర్ ఎపిసోడ్‌ను. ఇది కచ్చతంగా మన టీఆరెస్ వాళ్ల క్రియేటివిటీయే. అందులో డౌట్ లేదు. వెన్నపోటు ఈటలు అనే పేరును కూడా ఖరారు చేసి అలా వదిలారు. మీరెంత గ్రేట్ రా నాయన. ఆర్జీవే ఓ వింత జీవి. ఆ జీవికి కూడా రాని ఆలోచనలు మీకు వచ్చాయంటే.. మీరు వింతలోకెల్లా.. వింత జీవులన్నమాట. మీరుండాల్సిందే. హుజురాబాద్ ఎన్నికలు వర్దిల్లుగాక.. ఇలాంటి క్రియేటర్లను వెలికి తీసినందుకు. ఆర్జీవీలను తలదన్నే తాతలను సృస్టించినందుకు.