ఉత్కంఠకు తెరతీస్తూ త్వరలో టీఆరెస్ జిల్లాల అధ్యక్షులను అధిష్టానం ప్రకటించనున్నది. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఇప్పటికే ఈ అధ్యక్ష జాబితాపై ఓ క్లారిటీకి వచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు తీసుకున్న కేటీఆర్ చివరగా ఈ జాబితాపై తనదైన ముద్రను వేసుకునేలా ఫైనల్ చేసినట్టు తెలిసింది.
ఇదిప్పుడు సీఎం కేసీఆర్ వద్ద ఉంది. ఆయన ఓకే చెప్పగానే దీనికి ఆమోద ముద్ర పడనుంది. రేపో మాపో టీఆరెస్ అధ్యక్ష జాబితా విడుదల కానుంది. కాగా నిజామాబాద్ జిల్లా నుంచి సుజీత్ సింగ్ ఠాకూర్‌కు ఈ పదవి దక్కే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీని కోసం చాలా మంది పేర్లు పరిశీలించారు. మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అర్కెల నర్సారెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్ పేర్లను పరిశీలించారు. అయితే ఎవరి సమీకరణలు వారికున్నాయి. పార్టీ పదవులకన్నా.. నామినేటెడ్ పదవుల వైపే ఎక్కువ మొగ్గు చూపారు.
సుజీత్ కూడా ఇదే రేసులో ఉన్నాడు. చాలా కాలంగా పదవి కోసం ఎదురుచూస్తున్నాడు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆరెస్‌లో కలిసి పని చేశాడు. ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. అందరిలో ఒకడిగా ఉంటూ మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. టీఆరెస్వీ జిల్లా అధ్యక్షుడిగా చాలా కాలం కొనసాగాడు. విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొని విద్యా సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతూ వస్తున్నాడు. పెద్దల ఆశీస్సుల పుష్కలంగా ఉన్న సమయంలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని సుజీత్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం అధిష్టానం వద్ద ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.