మన్మథుడు-2 … నాగ్ కెరీర్‌లో ఓ అట్టర్ ఫ్లాప్, రాహుల్ రవీంద్రన్ తీసిన తొలిసినిమా. వేరే భాషలో తీసిన ఒ సినిమాను మక్కీకి మక్కీ దించేశారు. ఇక్కడి నేటివిటీకి అది అసలే కనెక్టు కాలేదు. బూతులు, నానార్ధాలు కోకొల్లలు. పాటలు అసలే బాగలేవు. తెలుగు తెరపై కొత్తదనం , కొత్త ప్రయోగం చేద్దామనుకున్నారు. ఇందులో నాగ్ మరీ దిగజారీ, తన విలువలన్నీ వదిలేసి మరీ చేశాడు.
మన్మథుడు అంటే అంతమాత్రం ఉండాలనుకున్నాడేమో.! ప్రేక్షకులు తను మార్చిన పంథాను మెచ్చుకుని మెడలేసుకుంటారని భావించాడేమో. ఈడ్చి తన్నింది సినిమా. పరాయి భాష సినిమా ప్రయోగం ఘోరంగా వికటించింది. నాగ్ చేతులే కాదు.. అన్నీ కాల్చేసుకున్నాడు. అంతా అయినంక చెంపలేసుకున్నాడు. ఇలాంటి సినిమా తీశానేంట్రా బాబు అని..? డైరెక్టర్ రాహుల్ కూడా ఓవర్ యాక్షన్‌లో పోయాడు.
ఈ సినిమా నిర్మాణంలో అతని ప్రతిభమేమీ లేదు. పరాయి సినిమాను మక్కీకరించాడు. అంతే. బూతులతో సహా. అశ్లీల, అసభ్య సన్నివేశాలతో సహా. డబల్ మీనింగ్ డైలాగులతో సహా. అలా తెలుగు నాట ప్రయోగం చేసి ..ఇంకోసారి ఇలాంటి చేస్తే చెప్పుతో కొట్టుకోవాలిరా బాబు.. అనే రేంజ్‌లో గుణపాఠం నేర్చుకున్నారు. ఈ రోజు రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంది.
తెలుగు కథ కొత్త పుంతలు తొక్కుతున్నది సరే. కొత్త ప్రయోగాల జోలికి వెళ్తున్నది సరే. కొత్త తరహా సినిమాలకు ఉత్సాహం చూపుతున్నది.. ప్రోత్సాహం లభిస్తున్నదీ సరే. కానీ మరీ ఇంతలా ఒకేసారి డోస్ పెంచి మాత్ర వేస్తే అది సైట్ ఎఫెక్ట్ అయి కూర్చుంది. లేని రోగాలకు ఆలవాలంగా మారింది. కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. కష్టపడ్డది పోయింది.. మీదకెళ్లి ఓ బద్నాం మూటగట్టుకోవాల్సి వచ్చింది.
