అతను సినిమాల్లో విలన్. మంచి నటుడు. అందరూ అభిమానిస్తారు. ప్రాంతాలకతీతంగా. కానీ ‘మా’ ఎన్నికలకు వచ్చే సరికి.. నాన్‌లోకల్ అయిపోయాడు. మేమంతా ఇక్కడ ఉండగా.. ఎక్కడి నుంచో వచ్చి మా మీద పెత్తనమేందీ ..? అని తిరగబడ్డారు. కులమూ పనిచేసింది. ప్రాంతమూ దెబ్బతీసింది. కానీ ఎక్కడా ప్రకాశ్‌రాజ్ బెదరలేదు.
అతని వ్యక్తిత్వం మరింత పరిమళించింది. హుందాగా ప్రవర్తించాడు సినిమాలో నటనకు జీవం పోసినట్టు. తను అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్లాడు. ఎక్కడా తలొగ్గలేదు. చివరి వరకు పోరాట స్పూర్తినే చూపాడు. మెగా ఫ్యామిలీ అండగా నిలవడం అతనికి అదనపు బలంగా తోచింది. అదీ తనకు పెద్ద మైనస్సే అయిందనేది తర్వాత తెలిసింది. అది వేరే విషయం. కానీ ఎక్కడ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆయన పోరాడిన తీరు.. కనబర్చిన పోరాట పటిమ అందరినీ ఆకట్టుకున్నది. అవును .. లీడర్ అనే వాడు ఇలాగే ఉండాలని అని నిరూపించాడు.
అప్పటి వరకైతే ఆయన నైతిక విజయమే సాధించాడు. ఆ తర్వాత కులం, ప్రాంతం.. అపరిపక్వ నటనాసురులంతా కలిసి అతన్ని ఓడగొట్టేశారు. బాగానే ఉంది. కానీ ప్రకాశ్‌రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం అతని ద్వంద్వం వైఖరిని తెలియజేసింది. ఓడితే పారిపోవాలా? పలాయనవాదం చిత్తగించాలా? ఉండి పోరాడొచ్చు.. ? అనుకున్నవాళ్ల గురించి నిలబడొచ్చు. కావాల్సిన వాటి కోసం ప్రశ్నించొచ్చు. సంక్షేమం కోసం పాటుపడొచ్చు.
అంటే అధ్యక్షుడిగా లేనందుకు ఏమీ అడగలేమని నిర్ణయించుకున్నాడా? ఇంకా ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో అని భయపడ్డాడా? నాన్ లోకగ్ గాన్నీ నాకెందుకీ కుల, కుళ్లు రాజకీయాలనుకున్నాడా? ఇందులో ఓ ఒక్కటి అనుకున్నా.. ఆయన నిజమైన నాయకుడు కాదు. నిలబడి తన వాళ్ల మధ్య నిలకడగా పోరాడే పటిమ లేనోడు.. వెన్ను చూసి రాజీనామా అనే సాకుతో పలాయనవాదం చిత్తగించేటోడు.. ఎప్పటికీ పరాజితుడే. అది ఎక్కడైనా. ఎప్పుడైనా.