ఈ పేప‌ర్ క‌టింగ్ చూశారా..! ఈ పేప‌ర్‌లో వార్త‌కు.. ఇక్క‌డ మ‌నం పెట్టిన హెడ్డింగ్‌కు ఏమైనా సంబంధం ఉందా ? ఏమీ ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదా..? సైన్యంలో తెలంగాణ రెజిమెంట్ పెట్టాల‌ని, భార‌త సైన్యంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక గుర్తింపు ఇవ్వాల‌ని ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరుతూ ఓ లేఖ రాశాడు. మొద‌టి ప్ర‌పంచ యుద్దం నాటికే హైద‌రాబాద్ రెజిమెంట్ ఉంద‌ని కూడా గుర్తు చేశాడు. రెజిమెంట్ ఏర్పాటు చేస్తే సంపూర్ణ స‌హ‌కారం ఏర్పాటు చేస్తామ‌ని కూడా చెప్పాడు. ఇదీ ఆ వార్త క‌థ‌నం.

అయితే ఏంటీ..? ఆయ‌న ఎంపీగా ఓడిపోవ‌డానికి, ఈ వార్త‌కు ఏం సంబంధం అంటారా? ఆగండాగండి.. అదే చెప్ప‌బోతున్నా.. సోష‌ల్ మీడియాలో ఈ వార్త‌తో నెటిజ‌న్లు త‌మ అభిప్రాయాల‌ను .. వినోద్‌కుమార్ ఓట‌మికి ముడిపెట్టి వెల్ల‌డిస్తున్నారు. ఎంత మంచి నేత‌, ఎంత విష‌య ప‌రిజ్ఞాన‌మున్న నాయ‌కుడు.. ఇలాంటి లీడ‌ర్‌ను ఎలా ఓడ‌గొట్టుకున్నార్రా.. మీ దుంప‌లు తెగ అని క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌ల‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

తెలుసు క‌దా.. అప్పుడంతా బీజేపీ హ‌వా. ఆ హ‌వాలో బండి సంజ‌య్ కూడా గెలిచాడు. బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ ను ఓడ‌గొట్టారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన క‌విత కూడా అర్వింద్ చేతిలో ఓట‌మిపాల‌య్యారు. బీజేపీ హవా పెరిగింది. నాలుగు స్థానాల్లో అనూహ్యంగా విజ‌యం సాధించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కేసీఆర్‌కు ఈ ప‌రిణామ‌ల‌ను ముందే కొంత ప‌సిగ‌ట్టాడు. కానీ బీజేపీ విజ‌యాన్ని ఆపే క్ర‌మంలో ఎంత చేసినా సాధ్యం కాలేదు.

బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ కు మంచి పేరుంది. రాజ‌కీయాల‌కు అతీతంగా అత‌న్ని ఇష్ట‌ప‌డ‌తారు. రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ప్ర‌తీ సంద‌ర్బాన్ని ఆయ‌న త‌న‌దైన శైలిలో కేంద్రం ముందుంచుతాడు. త‌న ప్ర‌య‌త్నాన్ని వంద‌శాతం విజ‌య‌వంతంగా చేస్తాడు. ఇదిగో ఇప్పుడు ఇలా… తెలంగాణ రెజిమెంట్ కోరాడు. ఎవ‌రికుంటుంది.. ఇంత క‌మిట్‌మెంట్‌..? మ‌రి ఇలాంటి నేత‌నా ఓడ‌గొట్టుకునేది..? అనేది కొంత మంది టీఆరెస్ అభిమానుల బాధ‌. ఇలా సంద‌ర్భాన్ని క్రియేట్ చేసుకుని త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు సోష‌ల్ మీడియాలో. జనం అంతే మ‌రి.. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియ‌దు. ఎప్పుడు ఎవ‌రు న‌చ్చుతారో తెలియ‌దు. గాలి అలా తిరిగుతుంది.. ఇలా గెలిచేస్తారు. ఆ హ‌వాలో బోయిన‌ప‌ల్లి లాంటివాళ్లూ కూడా కొట్టుక‌పోతారు. అదంతే.

You missed