మీడియా.. ఇక్కడా అక్కడా అని కాదు. అంతటా అట్లనే ఉన్నది. చెప్పాల్సింది చెప్పదు. ఏది ముఖ్యమో దానికి తెలియదు. ప్రజలకు ఏం కావాలో దానికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. అందుకే అటువైపే అది పరుగులు తీస్తుంది. మన దగ్గరే ఇంత సిగ్గుమాలిన మీడియా ఉందని మనం మొన్నటి వరకు అనుకున్నాం. దానికి మొన్నో ఉదాహరణ చూశాం. ఆరేళ్ల పాపను దారుణంగా రేప్ చేసి చంపేస్తే.. దాన్ని కనీసం పట్టించుకోకుండా హీరో సాయి ధరమ్ తేజ్ స్కిడ్ అయి పడిపోతే మన చానళ్లు ఎంత హంగామా చేశాయో చూసి సిగ్గుపడ్డం. మన మీద మనకే అసహ్యం వేసింది. ఇలా తయారయ్యామేందిరా..? అని విరక్తి కూడా పుట్టింది.
మన దగ్గరే కాదు.. మొత్తం మనదేశంలోని మీడియానే అట్ల తగలబడ్డది. కేంద్రానికి వ్యతిరేకంగా.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం హింసాత్మకంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ కేంద్రమంత్రి కొడుకే తన వాహనాలతో ఆందోళన చేస్తున్న రైతులపైకి ఎక్కించేశాడు. నలుగురికి పైగా రైతులు చనిపోయారు. ఓ జర్నలిస్టు కూడా మృత్యువాతపడ్డాడు. అంతకు ముందు హర్యానా సీఎం మనోహర్‌లాల్ కట్టర్ .. రైతులను లాఠీలతో కొట్టమని పిలుపునిచ్చాడు. జైళ్లకు వెళ్తే పెద్ద నాయకులవుతారంటూ వారిని ఉసిగొలిపాడు. లఖింపూర్-ఖేరీకి చెందిన ఎంపీ కూడా ఇదే తరహాలో రైతుల తలలను పగలగొట్టండని పోలీసులకు ఆర్డర్ వేశాడు. ఇవన్నీ జరిగిన తరుణంలోనే కేంద్ర మంత్రి కొడుకు రైతులపై కారెక్కించి రైతులను పొట్టన పెట్టుకున్నాడు. దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. ఇంతటి దారుణాలు జరుగుతున్నా మన దేశ మీడియా దీనిపై దృష్టి పెట్టలేదు.
మరి దానికి ఏది ఇంపార్టెంట్‌గా కనిపించిందో తెలుసా? బాలీవుడ్ హీరో.. షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడనే వార్త. దాని చుట్టే చక్కర్లు కొట్టాయి. చర్చలు, వేదికలు అన్నీ దీని చుట్టే.. యోగి నెత్తిపై జుట్టెందుకు చిన్నగుంది..? ఇంకా ఇలాంటి పనికి మాలిన వార్తలు వేసింది గానీ, ఇంకా పనికిరాని వాటిపై డిబేట్లు పెట్టింది గానీ, రైతులను హత్య చేసిన ఉదంతాన్ని నాయకులు తీరును మాత్రం ప్రశ్నించలేదు. అదీ మన మీడియా పరిస్థితి. ఏ మీడియా చూసినా ఏమున్నది గర్వకారణం…