తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో నిర్మించిన అల్లిపూల వెన్నల బ‌తుక‌మ్మ పాట పై అంత‌టా అసంతృప్తే క‌నిపిస్తున్న‌ది. దీనిపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారంతా. మిట్ట‌పల్లి సురేంద‌ర్ రాసిన పాట ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ దీనిపై త‌మ అసంతృప్తి వెల్ల‌డి చేస్తూ ధైర్యంగానే కామెంట్లు పెడుతున్నారు. ఉన్న విష‌యాన్ని చెప్తున్నారు. పెద‌వి విరుస్తున్నారు.

ఏఆర్ ర‌హ్మ‌న్ సంగీతం, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల‌తో నిన్న ఈ సాంగ్ క‌మ‌ర్శియ‌ల్ హంగుల‌తో నిర్మించిన‌ట్లుగానే ఉంది త‌ప్ప‌.. తెలంగాణ, బ‌తుక‌మ్మ ఆత్మ ఇందులో క‌నిపించ‌లేద‌నే అభిప్రాయాలు వెల్లువ‌లా వ‌చ్చాయి. స్లో న‌రేష‌న్ తో ఆక‌ట్టుకునే విధంగా లేద‌ని, ప‌దాల కూర్పూ నిరుత్సాహ‌ప‌ర్చింద‌ని అంటున్నారు. అంత‌కు ముందు వ‌చ్చిన బ‌తుక‌మ్మ పాట‌ల‌ను కూడా ఉద‌హ‌రించి.. దీంతో పోలిస్తే అవి ఎంతో అద్భుతంగా ఉన్నాయ‌ని కూడా అభివ‌ర్ణిస్తున్నారు.

సినిమా వాళ్ల చేతికిస్తే.. ఓ సినిమా పాట‌నే తీసి వ‌దిలార‌ని, అందులో ఇక్క‌డి ఆత్మ లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పేశారు. హ‌నుమంతుడిని చేయ‌బోతే కోతై కూర్చుందంటూ తెలంగాణ జాగృతి నెత్తి ప‌ట్టుకోవాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డింది. భారీ ఖ‌ర్చు పెట్టి.. పై నుంచి ఈ విమ‌ర్శ‌లేంటీ..? అని జాగృతి నేత‌లు ఇప్పుడు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. తెలంగాణ జాగృతి ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర్కోవ‌డం మొద‌టి సారి. ఎవ‌రిచ్చారో ఈ ఐడియా..? ఎవ‌రు సెల‌క్ట్ చేశారో ఈ పాట గానీ అక్క‌డే దెబ్బ‌కొట్టింది.

వాస్త‌వంగా ర‌హ్మాన్ సంగీతాన్ని త‌ప్పుబ‌ట్టాల్సిన ప‌నిలేదు. క‌మ‌ర్శియ‌ల్ మేళ‌వింపులు ఉన్నా… పాట‌కు త‌గ్గ‌ట్టు బాణీలు జీవం పోస్తాయి. ద‌ర్శ‌కుడూ ఇక్క‌డ పండుగ నాడిని ప‌ట్టిన త‌ర్వాతే ద‌ర్శ‌క‌త్వం చేశాడు. అత‌నిదీ త‌ప్పులేదు. త‌ప్పంతా ఎంచుకున్న పాట‌లోనే ఉంది. అది కొన‌సాగిన తీరులోనే ఉంది. ఆ ప‌దాల కూర్పులోనే ఉంది. ఆత్మ‌లేని పాట ర‌చ‌న‌లోనే ఉంది. అక్క‌డే జ‌రిగింది అస‌లు పొర‌పాటు? ఇదిప్పుడు చ‌ర్చ‌కు దారి తీసింది.

You missed