చేవేళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తన పేరుతో ఓ కరపత్రాన్ని విడుదల చేశాడు. అందులో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. తన విన్నపాన్ని, అభిప్రాయాలను, కేసీఆర్ తప్పుడు హామీల విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. అంతిమంగా ఆయన కోరింది ఏంటంటే.. హుజురాబాద్ ప్రజలు ఈటల రాజేందర్‌ను గెలిపించమని. కానీ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ పై వ్యతిరేక, తప్పుడు హామీలు లాంటి పదాలను విరివిరిగా వాడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడినట్టు కాకుండా, ప్రజలందరికీ జరుగుతున్న నష్టాన్ని ప్రస్తావించినట్టు కాకుండా కేవలం తన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి, తన ప్రాంతానికి లోబడిన సమస్యల గురించి మాత్రమే ప్రస్తావించి వదిలేశాడు.
తన కడుపుమంటను మాత్రమే చెప్పుకున్నాడు. ‘నాకు అన్యాయం జరిగింది.. నాకు హామీ ఇచ్చి తప్పాడు.. నన్ను మోసం చేశాడు.. నేను మోసపోయాను..’ అనే విధంగా మొత్తం కరపత్రాన్ని తన సమస్యల చుట్టూనే తిప్పుతూ పోయాడు. పాడిందే పాటరా.. అన్నట్టు తన సమస్యలను ఏకరువు పెట్టుకుని దాన్ని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించి.. దీనికి హుజురాబాద్ ప్రజలు బీజేపీకి ఓటేసి రాజేందర్ గెలిపించాలని సూత్రీకరించి.. ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పి ముగించాడు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొండంత రాగం తీశాడు.. కానీ ఆ రేంజ్లో కరపత్రం రాయలేకపోయాడు.
వాస్తవానికి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. నెరవేరని హామీల లిస్టు పెద్దగానే ఉంది. నిరుద్యోగం, ఉపాధి సమస్య వెక్కిరిస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఒక స్టేట్ లీడర్‌గా కాకుండా ఓ లోకల్ స్థాయి నాయకుడిగా, గల్లీ లీడర్‌గా తన మనసులోని ఆవేదనను, వికారాన్ని, ఆక్రోశాన్ని వెల్లగక్కి బోడి గుండుకు, మోకాలికి ముడేసినట్టు తన సమస్యలన్నీ తీసుకుపోయి హుజురాబాద్ ప్రజలకు రుద్ధి రాజేందర్‌ను గెలిపించండని అభ్యర్ధించడం అంత సమంజసంగానైతే లేదు.