పైసలు గుమ్మరించి సర్పంచులయ్యారు. సంపాదించాలనుకున్నారు. కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. ఎడాపెడా దొరికిన పనులన్నీ తామే ఆబగా చేసేశారు. పైసలు ఇయ్యాళ కాకపోతే రేపొస్తాయిలే.. ఎటుపోతాయి.. అనుకున్నారు. ఏళ్లు గడుస్తున్నాయి. లక్షలు పెట్టి కూర్చున్నారు. పైగా ఆశతో అప్పుకు తెచ్చారు. ఏవీ బిల్లులు? ఇగరావు. అగరావు. చూసీ చూసీ యాష్టకొచ్చింది. అడిగీ అడిగీ అడియాశే మిగిలింది. దీంతో బలవన్మరణం ఒకటే మార్గంగా తోచింది. అలా చావుకు దగ్గరవుతున్నారు. సర్పంచులు పనులు చేసుకోవడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ సర్పంచులు పనులు చేశారు. పైసలొచ్చినయి. పర్సెంటేజీలు పోను.. మంచిగానే మిగులబాటయ్యింది.
కానీ ఇప్పటి సర్పంచులది మాత్రం దురదృష్టమే. నిజమైన కాంట్రాక్టర్లకే దిక్కులేదు. తెలంగాణ వచ్చిన నాటి నుంచే ఈ నిధుల లేమీ వెక్కరిస్తుంది. టెండర్లు వేసినా పెద్దగా కాంట్రాక్టర్లు స్పందించడం లేదు. మిషన్ కాకతీయ మొదట్లో టీఆరెస్ నేతలు కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. ఎడాపెడా సంపాదిద్దామనుకున్నారు. ఇగో, అప్పట్నుంచే మొదలైంది. ఈ బిల్లుల బాగోతం. సమయానికి ఎప్పడూ పైసలు రాలే. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంట్రాక్టర్ పనులు చేసి బాగుపడి బట్టకట్టి బతికినోడు లేడు. కరోనా వచ్చిన తర్వాతైతే ఇంకా పరిస్థితి దారుణం.
నెలనెలా పింఛన్లకు సర్దుబాటు చేయాలె. రైతు బంధు ఇయ్యాలె. కొత్తగా దళితబంధు ఇయ్యాలె. ఇంకా ఇబ్బడిముబ్బడిగా ఉన్న సంక్షేమ పథకాలకు కోట్లు గుమ్మరించాలె. మరి వీటన్నింటికీ పైసలు కావలె. ఏడికెళ్లి తేవాలె. ఉన్నవాటినే సర్దుబాటు చెయ్యాలె. వచ్చే కొద్ది పాటి ఆదాయమంతా వీటికే పెట్టాలె. ఇంకా అభివృధ్ది పనులకేడనుంచి తేవాలె? పెండింగ్ బిల్లులు ఎట్లా చెల్లించాలె? అర్థం చేసుకోరు.
బిల్లులు, బిల్లులు.. బిల్లులు. ఉంటే ఇవ్వమా? ఎప్పుడుంటాయి? వస్తే చెప్పమా? ఏదో సినిమాలో అప్పులోళ్లలకు రాజేంద్రప్రసాద్ చెప్పిన డైలాగులాగే ఉంది ప్రభుత్వ పరిస్థితి. మొన్న హయత్‌నగర్‌లో నర్సింహ్మా అనే కాంట్రాక్టరుకు 30 లక్షలు రావాల్సి ఉందట… అవి ఇప్పట్లో వచ్చేటట్టు లేవని సచ్చి ఊరుకున్నాడు. కాంట్రాక్టర్ల అవతారమెత్తిన సర్పంచులూ అదే దారి ఎంచుకున్నారు. ఎవరేం చేసినా.. ఇక్కడ పైసల్లేవు. సర్కారు ఏమీ చేయలేదు.. అంతే. అర్థం చేసుకోండి.. ప్లీజ్