సినిమా టాకీసులు కళకళలాడుతున్నాయి. మొన్నటి వరకు కరోనా భయంతో కొంత, ఓటీటీ ప్రభావంతో మరికొంత మంది టాకీసుల్లో సినిమాలు చూసేందుకు అయిష్టత చూపారు. లాక్‌డౌన్ పుణ్యమా అని అసలు టాకీసులకు వెళ్లాలనే కోరికే క్రమంగా చచ్చిపోతూ వచ్చింది జనాల్లో. ఇప్పుడు పరిస్థితి మారుతూ వస్తోంది. కొత్త సినిమాల విడుదల పెరుగుతున్నట్టుగానే .. టాకీసులకు జనాలు కూడా రావడం మొదలుపెట్టారు. అబ్బ.. హౌజ్ పుల్ అని బోర్డు పెట్టి ఎన్ని రోజులైందో కదా..ఇలాంటి పరిస్థితి చూసి ఎంత కాలమైందో కదా జనాలకు. మొత్తానికి టాకీసులకు పూర్వవైభవం వచ్చింది. ఇలాంటి పరిస్థితే రావాలనుకున్నారంతా. వచ్చింది. సంతోషం.
కానీ పాఠశాలలకు మాత్రం ఇంకా పూర్వవైభవం రాలేదు. అవి ఇంకా కళకళలాడటం లేదు. హాస్టళ్లు తెరుచుకోలేదు. కొంత మంది ఆఫ్‌లైన్. మరికొంత మంది ఆన్‌లైన్. ఫీజులు మాత్రం గుంజుతున్నారు. బుక్కులకు ముడిపెడుతున్నారు. పనిలో పని పాతవి కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. బస్సులను బయటకు తీయాలంటే భయపడ్డారు మొన్నటి వరకు. లక్షలు లక్షలు పెట్టి బస్సులను బయటకు తీస్తే.. మళ్లీ థర్డ్ వేవ్ అని విద్యా సంస్థలు బంద్ చేయమంటే.. ఏందీ పరిస్థితి? అని అనుమానంతో చాలా మంది ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వనే లేదు. దీంతో పిల్లలకు స్కూలు పాఠాలు దక్కలేదు. ఇప్పుడు మెల్లగా తీస్తున్నారు బస్సులను. దసరా తర్వాత ఇవీ కళకళలాడేలా ఉన్నాయి. అన్నీ బాగుపడ్డాయి కానీ.. విద్యా వ్యవస్థే కుంటుపడిపోయింది. ఆ చదవులు వీరికి దూరమయ్యాయి. కరోనా దెబ్బకు పిల్లలు మానసికంగా, విద్యా పరంగా చాలా నష్టపోయారు. ఈ నష్టం పూడ్చలేనిది.